రామగిరి, జూన్ 14: వేసవి సెలవుల అనంతరం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాల్సిన ప్రభుత్వ బడులు.. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉండటంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తవువుతున్నాయి. 2026-27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే బడుల్లోని పిల్లల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, అన్ని పాఠశాలల్లో ఉదయం అల్పాహారం (నాస్టా) అందజేస్తామని చెప్పిన సర్కార్ పాఠ్య పుస్తకాలు తప్ప మిగిలినవేవీ అందుబాటులోకి తేలేకపోయింది.
అలాగే జిల్లాలో మూసివేసిన 311 ప్రభుత్వ పాఠశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉంది. ఆ పాఠశాలలను తెరిచినప్పటికీ నిర్వాహణ నిధులను ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు సర్కార్ ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. ఇలా అనేక సమస్యలు సర్కార్ పాఠశాలలకు స్వాగతం పలకనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, రెండు జతల స్కూల్ యూని ఫామ్ సిద్ధంగా ఉండేవి. తొలి రోజే పండుగ వాతావరణంలో పాఠశాలలకు వచ్చే పిల్లలకు వాటిని అందజేసి, సర్కార్ బడుల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పించేదని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
15న పాఠశాల ప్రారంభంపై అసంతృప్తి
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పాఠశాలలను వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తెరవాల్సి ఉంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ఈ నెల 15వ తేదీకి మార్చడం చర్చనీయాంశమైంది. సాధారణంగా కొన్ని సమయాల్లో తగిన కారణాలు చూపి, సెలవులు పొడగించాలని కోరినా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించదు. కానీ ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభాన్ని మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభించడం వెనుక ఉన్న ఆంత్యరం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో వైపు జూలై రెండో శనివారం పనిదినంగా ప్రకటించడాన్ని విద్యారంగ నిపుణులు, మెజార్జీ ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

Nalgonda5
అమావాస్య సెంటిమెంట్ అడ్డు
సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు మొదటి రోజు పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. అమావాస్య సెంటిమెంట్ కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల్లోనూ ఉంది. అమావాస్య రోజున పాఠశాలలు తెరిచి, బస్సులు పంపిస్తే పిల్లలు వస్తారా..రారా అనే సంశయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. మంగళవారం కూడా కొందరు అడ్డుగా భావిస్తుండటంతో బుధవారం తర్వాతే పిల్లలు పాఠశాలల్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పుస్తకాలు వచ్చినా..యూనిఫామ్ ఏదీ ?
జిల్లా వ్యాప్తంగా 1229 ప్రభుత్వ పాఠశాలల్లోని (జెడ్పీ, లోకల్ బాడీ, మోడల్, కేజీబీవీ)83వేలకు పైగా విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, రెండు జతల యూనిఫామ్ అందించాలి. కానీ ఈ విద్యా సంవత్సరం కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
నాస్టా అమలుపై అనుమానాలు!
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం పిల్లలకు ఆల్పాహారం (నాస్టా) అందిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించినప్పటికీ అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు విద్యాశాఖకు కానీ, పాఠశాలలకు కానీ ఎలాంటి ఉత్తర్వులు (నామ్స్) అందలేదని తెలుస్తున్నది.
మూతపడిన పాఠశాలలు ఓపెన్ అయ్యేనా..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 311 ప్రభుత్వ పాఠశాలలను.. పిల్లలు లేరనే నెపంతో మూసివేశారు. అయితే ఈ పర్యాయం వాటిని తెరుస్తారా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా చందంపేట మండలంలో 36, తిరుమలగిరి సాగర్‌లో 22, పెద్దవూరలో 19, దేవరకొండలో 18, గుండ్లపల్లిలో(డిండి) 17, పెద్దఅడిశర్లపల్లి (పీఏపల్లి)లో 16, గుర్రంపోడు, కొండమల్లేపల్లిలో 13, మిర్యాలగూడలో 12, త్రిపురారంలో 11 ఉండగా మిగిలిన మండలాల్లో 3 నుంచి 10 లోపు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం గ్రామంలోని పాఠశాల మూతపడితే చిన్నారుల చదువుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ దానికి తూట్లు పొడిచేలా వ్యహరిస్తోంది. ఆయా గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంతో స్థానికులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకవేళ మూత పడిన పాఠశాలలను తిరిగి తెరిచినా వాటికి ఇవ్వాల్సిన గ్రాంట్‌ను ఏడాది గడుస్తున్నా విడుదల చేయకపోవడం దారుణం.
మౌలిక వసతుల కల్పనలో సర్కార్ విఫలం
విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వకపోవడంతో చాక్ పీసులు, పాఠశాల భవనాలకు సున్నాలు, స్కావెంజర్లకు వేతనాలు తదితర పనులు కుంటుపడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని విద్యాశాఖ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రభుత్వ విద్యపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.