నల్లగొండ ప్రతినిధి, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 26న అత్యంత పవిత్రమైన దేశ 75వ గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కాంగ్రెస్ సర్కారు కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నది. నాలుగు రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా, ఆర్భాటంగా నిర్వహించిన గ్రామసభల్లో సైతం లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించింది. ఈ జాబితాల్లోని లబ్ధిదారులంతా ఇక తమకు ఆదివారం నుంచి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆశించారు. కానీ తీరా రాష్ట్ర ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. సరిగ్గా ఒక రోజు ముందు శనివారం ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ గణతంత్ర దినోత్సవం రోజున కేవలం మండలంలోని ఒక్క గ్రామంలోనే పథకాలను అమలు చేస్తామని యూటర్న్ తీసుకోవడం కలకలం రేపుతున్నది. మిగతా గ్రామాల లబ్ధిదారులకు వచ్చే నెల మొదటివారం నుంచి మార్చి చివరి నాటికి రెండు నెలల పాటు దశల వారీగా అమలు చేస్తామని చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల, పథకాల అమలు పట్ల చిత్తశుద్ధి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చి వెనువెంటనే ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని ప్రచార సమయంలో, వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తామని పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఏడాది పాలన పూర్తయినా ప్రజలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన తప్ప చేసిందేమీ లేదన్న తీవ్ర అసంతృప్తిలో ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. సంక్రాంతికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలంతా నిజమే అనుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ సభల పేరుతో ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు హడావుడి చేశారు. కానీ గ్రామసభల్లో ప్రభుత్వం ఊహించింది ఒకటైతే ప్రజల నుంచి వచ్చిన స్పందన మరోలా ఉంది. నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో నిలదీతలు…
అడ్డగింతలు… ఆగ్రహావేశాలే ఎదురయ్యాయి. జాబితాల్లోని లబ్ధిదారుల్లో ఎక్కువ మంది అనర్హులే ఉన్నారని ఆయా గ్రామాల్లోని పేదలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా తమ పేర్లు ఎందుకు లేవని అధికారులను నిలదీశారు. దాంతో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించక తప్పలేదు. జాబితాల్లో పేర్లు రాని అర్హులంతా మరోసారి దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో కొత్తగా ప్రజల నుంచి 1,17,644 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రైతుభరోసా కోసం 844, రేషన్‌కార్డుల కోసం 53,844, ఇందిరమ్మ ఇండ్ల కోసం 47,471, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 15,485 ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే ఆయా పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల సంఖ్య కంటే కొత్తగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య రెట్టింపు ఉండడం గమనార్హం.
వెల్లువలా వచ్చిన కొత్త దరఖాస్తులతో ప్రభుత్వ వర్గాలు సైతం కంగుతిన్నట్లు తెలిసింది. కొత్త దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుంటే ప్రస్తుత లబ్ధిదారులకు వర్తింప చేసినా ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. దాంతో నేటి నుంచి అన్ని గ్రామాల్లో అమలు కావాల్సిన పథకాలను కొత్త దరఖాస్తుల పరిశీలన పేరుతో మరో రెండు నెలల పాటు సాగదీసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రతి మండలంలో ఒక్క గ్రామంలోనే నాలుగు పథకాలను గ్రౌండింగ్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులంతా శనివారం రోజంతా కసరత్తు చేశారు. సాయంత్రానికి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. దాని ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లోనే లబ్ధిదారులకు పథకాలను అందజేయనున్నారు. నల్లగొండ మండలం గుండ్లపల్లిలో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పథకాల గ్రౌండింగ్‌ను ప్రారంభించనున్నారు.
ఎంపిక చేసిన లబ్ధిదారులకే ఎంట్రీ
నాలుగు రోజుల పాటు గ్రామసభల్లో ఎదురైన నిలదీతలు, అడ్డగింతలు, తిరుగుబాట్లతో ప్రభుత్వం పూర్తిగా అల్టర్ అయినట్లు తెలుస్తున్నది. అందులోభాగంగా ఆదివారం నాలుగు పథకాలను ప్రారంభించనున్న గ్రామాల్లో అనధికార ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వాసనీయ సమాచారం. పథకాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అన్ని నియోజకవర్గాల్లోని ఒకటో, రెండో గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలో లేని ఇతర అర్హులు ఆందోళనకు దిగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆదివారం పథకాలను ప్రారంభించనున్న గ్రామాల్లో కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఎంట్రీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొనున్న గుండ్లపల్లి కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలా చెప్పడమంటే ఇక ఇతరులకు ఈ కార్యక్రమంలోకి అనుమతిలేనట్లేనని స్పష్టమవుతున్నది. పథకాల వారీగా కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు తాసీల్దార్, రైతుభరోసాకు ఏఓ, ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీఓ, ఆత్మీయ భరోసాకు ఏపీఓలు బాధ్యత తీసుకుంటూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో భారీ పోలీసు బందోబస్తు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. దాంతో ఉమ్మడి జిల్లా అంతటా పథకాల ప్రారంభ కార్యక్రమాలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి.