నల్లగొండ, జూన్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అదనపు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందడం లేదనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే తమకు అందుబాటులోకి రావడం లేదన్నారు. కనీసం తమ ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. మాజీ ప్రజా ప్రతినిధులమైన తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను బయట పెట్టడం లేదని, దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం లేదన్నారు. నిరుపేదలు ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి ఇండ్లు రావడం లేదని, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు ప్రజావాణి కార్యక్రమానికి వస్తే కలెక్టర్ అందుబాటులో లేకుండా పోవడంతో అదనపు కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ నుండి మొదలుకుని మండల స్థాయి అధికారుల వరకు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వింటున్నారని, అధికారులు నిజాయితీగా పని చేయడం లేదన్నారు. అధికారులు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల గురించి తెలుసుకోవాలన్నారు.
ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదలకు అన్యాయం జరగవద్దని అన్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి, రేషన్ డీలర్ కు మొదటి విడతలోనే ఇండ్లు ఇచ్చారని, కానీ నిరుపేదలకు మాత్రం ఇండ్లు రాలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక అధికారులు స్పందించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.