రంగారెడ్డి, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నది. జిల్లాలో ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీలున్నాయి. చేవెళ్ల, శంకర్పల్లి, షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఆమగనల్లు, మొయినాబాద్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఇతర పార్టీల కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించింది. ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15మంది కౌన్సిలర్లకు కాంగ్రెస్ నుంచి ఒక్కరే గెలుపొందారు.
అయినా ఆ పార్టీ ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓటుతో పాటు బీజేపీ నుంచి గెలిచిన ఆరుగురు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకరిని కలుపుకొని బీఆర్ఎస్కు చెందిన రాజునాయక్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని ఆయనకు చైర్మన్ పదవి అప్పగించారు. బీజేపీకి చెందిన కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవినికట్టబెట్టారు. చైర్మన్ కావడానికి పూర్తి మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ అడ్డదారిలో పీఠం దక్కించుకున్నదని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరి చైర్మన్ అయిన రాజునాయక్ ఇంటిపై దాడిచేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 మంది కౌన్సిలర్లల్లో కేవలం పది మంది మాత్రమే గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లను కిడ్నాప్ చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి గెలిచిన రెబల్స్‌ను తమవైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నది. చైర్మన్‌గా కాంగ్రెస్, వైస్ చైర్మన్‌గా బీజేపీ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు.