నమస్తే నెట్వర్క్, జూలై 24: ఢిల్లీలో విద్యార్థులపై దాడి, నీట్ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై సహా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేటీఆర్ చేపట్టిన ధర్నాకు మద్దతుగా నిరుద్యోగులు, విద్యార్థులు కదం తొక్కారు. మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మందమర్రిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలో యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిరసనలో పాల్గొన్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాత బస్‌స్టాండ్ వద్ద అంబేదర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్, బోధన్‌లలో నిరసనలు కొనసాగాయి. కరీంనగర్లో యూఎస్ఎఫ్ఐ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని, పీటీసీకి తరలించారు. ఖమ్మం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దీక్ష చేపట్టారు. బోనకల్లులో భారీ ధర్నా నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రధాన సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ర్యాలీ
బూర్గంపహాడ్ మండలం సారపాక, తిరుమలాయపాలెంలో నిరసనలు నిర్వహించారు. ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీవైఎల్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి వరంగల్ల జిల్లాలోనూ నిరసనలు కొనసాగాయి.
నారాయణపేట జిల్లా కోస్గిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులు ‘హలో విద్యార్థి- చలో కోస్గి’ పేరుతో ధర్నా చేపట్టారు. నీట్ అంటే అర్థం తెలియని 6, 7వ తరగతి విద్యార్థులను తీసుకొచ్చి ధర్నా చేయించడంపై స్థానికులు మండిపడ్డారు.