వరంగల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాడు.. నేడు.. రేపు.. తెలంగాణకు రక్షకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నిరూపితమైన సత్యమిది. కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కేసీఆర్ మాట్లాడితే సంచలనం. మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం. తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా, రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయపార్టీ ఎదుర్కోని విషమ పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. అధికారంలోకి వచ్చిన రెండేండ్లకాలంలోనే తీవ్రమైన ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నది. అదే సమయంలో గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతిస్వల్పకాలంలోనే ప్రజలు బీఆర్ఎస్కు ఇస్తున్నారు. గులాబీ పార్టీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదని ఇటీవలి పరిణామాలన్నీ స్పష్టంచేస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం దాకా, చంద్రబాబు మొదలుకొని వైఎస్ వరకు, రోశయ్య నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా నిత్యం పోజులు కొట్టే నాయకులు, వ్యక్తులు, సంస్థలు.. అందరికీ కేసీఆరే సబ్జెక్ట్. మార్కెట్ పరిభాషలో.. ద మోస్ట్ సేలబుల్ ప్రోడక్ట్. ఎన్నికల రాజకీయాల్లో బీఆర్ఎస్ అప్రతిహత విజయాలు సాధించినా, అఖరి అంచులదాకా వెళ్లి ఆగిపోయినా.. అసలు పోటీయే చేయకపోయినా.. కేసీఆర్ పేరెత్తకుండా రాజకీయం పూటగడపని రోజు లేదు. 2001లో బీఆర్ఎస్ను స్థాపించి, 14 ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటాన్ని నడిపినప్పుడు ఆయనలోని ఉద్యమకారుడు ప్రళయకాల రుద్రుడిలా మెరిశాడు. తెలంగాణను సాధించి, అనతికాలంలోనే దేశమే గర్వపడేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దినప్పుడు ఆయనలోని పాలకుడు ప్రభాత సూర్యుడిలా వెలుగులీనాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, మౌనంగా అన్నీ గమనిస్తున్నా.. ఆయనలో తుఫాన్ ముందరి ప్రశాంతతను తలపిస్తున్నాడు. అందుకే యావత్ తెలంగాణ కేసీఆర్ వైపే చూసింది. చూస్తున్నది, చూస్తుంది కూడా! ఉద్యమంలో లక్షల మెదళ్లను కదలించినా.. తూటాల వంటి మాటలతో మరఫిరంగులను పేల్చినా.. తెలంగాణ హక్కులకోసం పట్టు సడలకుండా ఉక్కుపిడికిలితో కొట్లాడినా.. ప్రభుత్వాధినేతగా జనబాహుళ్యానికి సంక్షేమాన్ని అందించినా, పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపినా.. కేసీఆర్ కేసీఆరే!
తెలంగాణ అంటే కేసీఆర్!
గడిచిన 25 ఏండ్లేకాదు… భవిష్యత్తు ‘తెలంగాణ అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే తెలంగాణ’ గా స్థిరపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2.05 శాతం ఓట్లతో అధికారానికి దూరమైనా.. ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటును సాధించలేకపోయినా తెలంగాణ హక్కుల రక్షణల విషయంలో రాజీ లేని పోరుకెరటం కేసీఆరే అన్నది ఆయనతో విభేదించేవాళ్లు సైతం అంగీకరించే నిజం. నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో కొత్త నాయకత్వం పుట్టింది. ఆ సమయంలోనూ తెలంగాణ నుంచి ఎదిగివచ్చిన నాయకుల్లో కొరవడిన ‘తెలంగాణ ఆత్మ’కు బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ప్రాణప్రతిష్ట చేశారు. గులాబీమయమైన 25 ఏండ్ల ప్రయాణంలో తెలంగాణ ఆత్మ, స్థానిక స్పృహ నిండిన కొత్తనాయకత్వాన్ని కేసీఆర్ అందించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ‘అపరిచితులు’ అనేకమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. జనరల్ స్థానాలను సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కేసీఆర్ పరిచయం చేశారు. అలాగే, 2014, 2018 ఎన్నికల్లోనే కాదు ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లోనూ అనేకమంది నవయువకులను చట్టసభలకు తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనేకాదు, ఇప్పుడు కూడా తెలంగాణకు కేసీఆరే సర్వనామం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రతిసారీ ఆర్థిక సర్వేల రూపంలోనో, పరిశ్రమలు, ఐటీ రంగాల ఉత్పత్తుల సృష్టి రూపంలోనో, స్వచ్ఛ గ్రామాల రూపంలోనో, స్టార్టప్‌ల రూపంలోనో కేసీఆర్ కీర్తి ఆకాశమంత ఎత్తున మెరుస్తూనే ఉన్నది. విభ్రమతో దేశం శిరస్సు ఎత్తి దర్శిస్తున్నది.
గర్వంగా చెప్పుకొనేవారికైనా, గర్వం తలకెక్కిన వారికైనా..ఆయన పేరెత్తకుండా రోజు గడువదు తెలంగాణల.
నేషనలో, లోకలో.. పార్టీ లీడరో, క్యాడరో.. ఎన్నికలైనా, ఎన్నేండ్లయినా..ఆయన పేరెత్తకుండా రాజకీయం నడువదు తెలంగాణల.
సకలజన హిత పథకాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా ఆయన ఆనవాళ్లు లేకుండా ముందుకేగవు తెలంగాణల.
పండుగైనా, ఫంక్షన్ ఏదైనా.. బరాత్ అయినా, దావత్ అయినా ఆయన పాట మోగకుండా ధూంధాం పూర్తికాదు తెలంగాణల.
నలుగురు కూడి నవ్వేవేళల, నలుగురు కలిసి నడిచే దారుల..సంబురాల్లో అయినా, సందర్భమేదైనా..ఆయన పేరు తలవకుండా ఉండలేదు తెలంగాణ
అందుకే, నిన్న.. నేడు.. రేపు..తెలంగాణ అంటే కేసీఆర్! కేసీఆర్ అంటే తెలంగాణ!
తెలంగాణ తప్ప, వేరే ఏదీ ఆశించని ఉద్యమకారుడు- కేసీఆర్
తెలంగాణ ప్రజలు తప్ప మరెవరినీ లెక్కచేయని మొండోడు- కేసీఆర్
తెలంగాణ ప్రగతి తప్ప, మరేదీ పట్టించుకోని పాలకుడు- కేసీఆర్
తెలంగాణ ప్రయోజనాలు తప్ప, మరేదీ పట్టని పరిరక్షకుడు- కేసీఆర్
స్వాప్నికుడు, సాధకుడు, సాహసికుడు-కేసీఆర్
ఆయన.. తెలంగాణ రూపు మార్చిన బాపు!
దగాపడిన జాతిని దాస్యవిముక్తం చేసిన జాతిపిత!
హ్యాపీ బర్త్‌డే కేసీఆర్