వనపర్తి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ అడ్డదారిలో సొం తం చేసుకున్నది. అమరచింతలో పూర్తి స్థాయి మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు. మొత్తం పది స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు మూడు చొప్పున, మరో స్థానం సీపీఎం అభ్యర్థికి వచ్చింది. సీపీఎంతో ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులు కూడా లేరు. మూడు స్థానాలున్న బీఆర్ఎస్, మరో మూడు వార్డులున్న బీజేపీ అవగాహనకు వచ్చాయి. రెండు పార్టీల సభ్యులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో ఏకాభిప్రాయం తో ఉన్నారు. ఈ పక్షంలో తనకు రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన మంత్రి వాకిటి శ్రీహరి ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని అడ్డదారిలో వెళ్లారు.
పోలీసులు, మున్సిపల్లో కొందరు ఉద్యోగులతో ఫోన్ ద్వారా ప్రలోభాలకు దిగి చైర్మన్ ఎన్నికను మలుపు తిప్పారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న అనంతరం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్కు చెందిన జింక సువర్ణకు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న తన భర్త ద్వారా ఫోన్ చేయిం చి సీన్ మార్పించారు. కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ వార్డు సభ్యులను ప్రలోభాలకు గురిచేసి సువర్ణను అడ్డదారిలో చైర్ పర్సన్‌ను చేశారు. బీఆర్ఎస్ కండువాతో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లిన కౌన్సిలర్ సువర్ణ.. చైర్ పర్సన్‌గా ఎంపిక అనంతరం మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొని బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్స్అఫీషియో ఓటుతో అమరచింత మున్సిపాలిటీని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆత్మకూర్ సీఐ శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరిస్తూ బయటి వారితో ఫోన్ మాట్లాడించి అధికార పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కేలా చేశారని సీఐతో కౌన్సిలర్ మేర్వ రాజు వాగ్వాదానికి దిగాడు.
కంటతడి పెట్టుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్
అమరచింత చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్ని క పూర్తి చేశామని జడ్పీ సీఈవో రామమహేశ్వర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి లక్ష్మి రోదిస్తూ మున్సిపల్ కా ర్యాలయం నుంచి బయటకు వచ్చారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తనను చైర్మన్‌గా ఎన్నుకుంటామని వచ్చారని, అంతలోనే సువర్ణతో ఒక పోలీసు అధికారి, మున్సిపల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బాత్రూమ్ పేరుతో బయటకు పిలిచి క్షణాల్లో రహస్యంగా ఫోన్ మాట్లాడించారని, ఇదంతా ఎన్నికల అధికారుల కండ్లముందే జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సువర్ణను ప్రభుత్వ అధికారులే అడ్డదారిలో ప్రలోభాలకు గురిచేసి చైర్‌పర్సన్‌గా ఎన్నుకునేలా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు రాజీనామా..
35 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లకు వనపర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎంపికలో పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు చీర్ల విజయ్‌చందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయ్ చందర్ భార్య రజిని 3వ వార్డు సభ్యురాలిగా గెలుపొందగా, కౌన్సిలర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వనపర్తి ము న్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్‌లోనే ఐదుగురు మహిళలు ఈ పదవికి పోటీ పడ్డారు. వీరిలో సీనియర్లకు చైర్పర్సన్ స్థానం ఇవ్వకుండా మాధవి, మధుసూదన్‌గౌడ్‌ను ఎన్నుకోవడంతో వివాదం తలెత్తింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఎలా అవకాశం ఇస్తారని, అందుకే తాము పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.