Metpally | మెట్పల్లి, ఫిబ్రవరి 16 : జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయానికి దిగజారాయి. బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నది. మున్సిపల్లో 26 సీట్లకు బీఆర్ఎస్కు 6, కాంగ్రెస్‌కు 6, బీజేపీకి 10 రాగా, నలుగరు స్వతంత్రులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన సీట్లు సరిపోకపోవడంతో బీఆర్ఎస్ తటస్థం గా ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, పార్టీ నాయకులు నిర్ణయించారు.
కాంగ్రెస్ నలుగురు స్వతంత్రులతో, మరో వైపు 10 మంది సభ్యులతో బీజేపీ క్యాంపు రాజకీయాలు నడిపాయి. ఇరు పార్టీలకు స భ్యులు సమానంగా ఉండటంతో ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీ నుంచి ధర్మపురి స్వరూ ప, కాంగ్రెస్ నుంచి మైలారపు లింబాద్రిని ఆయా పార్టీల కౌన్సిలర్లు ప్రతిపాదించారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీన కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఆ పార్టీ అభ్యర్థికి చెయ్యెత్తడంతో కాంగ్రెస్‌కు 11 ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికయారు. తర్వా త వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. తమ సభ్యులకు విప్ జారీ చేశామని, అయినా ఒకరు క్రాస్ ఓటుకు పాల్పడ్డారని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బీజేపీ నాయకులు కొత్త నాటకానికి తెరలేపారు. సదరు కౌన్సిలర్ సభ్యత్వానికి ఢోకా లేకుండా విప్ పత్రాలను ఆలస్యంగా సమర్పించినట్టు తెలిసింది.

బీజేపీ అధ్యక్షుడిపై దాడి
కాంగ్రెస్‌తో ముందుగానే కుమ్మక్కై, కా వాలనే విప్ పత్రాలను సకాలంలో ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ బీజేపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు మెట్‌పల్లిలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా అధ్యక్షుడిపై భౌతిక దాడికి దిగారు.