– తాపస్ గురువందనంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి
– నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 162 మంది ఉపాధ్యాయులకు సన్మానం
రామగిరి, ఆగస్టు 26 : ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని, అయినప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పలు సమస్యలను పరిష్కారం చేయడంలో తాపస్ ఎంతో కృషి చేస్తుందన్నారు. తాపస్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యా రంగానికి సరైన బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించాలని, దీంతో ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందన్నారు.
ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ సామాజిక విశ్లేషకులు భాస్కర్ యోగి మాట్లాడుతూ.. మన సంస్కృతిలో గురు పరంపర గొప్పతనాన్ని, విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని గుర్తుచేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో గుర్తించిన 162 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, అవార్డు సన్మాన పత్రం, జ్ఞాపికలు అందజేశారు. తాపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, రాష్ట్ర సహాయ అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి, బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు ఇరుగు శ్రీరామ్, భాస్కర్ రెడ్డి, కంచనపల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

‘విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం’