Allu Arjun | అభిమానాన్ని కేవలం సినిమా, హీరోలపై ప్రేమకే పరిమితం చేయకుండా.. సామాజిక సేవకు కూడా ఉపయోగించవచ్చని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరోసారి నిరూపించింది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా చేపట్టిన ఓ భారీ కార్యక్రమానికి ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమానికి మద్దతుగా హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ భారీ అవగాహన కార్యక్రమంలో భాగంగా మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 820 పాఠశాలలు, వివిధ సమాజాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్-నికోబార్ దీవుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 3 లక్షల మంది బాలికలు, యువతులకు హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించడం, వ్యాధి నివారణకు అందుబాటులో ఉన్న మార్గాలపై సమాచారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. యువతలో ఆరోగ్యంపై చైతన్యం పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అభిమాన సంఘాలు ఒకే లక్ష్యంతో పనిచేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా అభిమాన సంఘాలు హీరోల పుట్టినరోజులు, సినిమా విడుదలలు, ఇతర వేడుకలకు మాత్రమే పరిమితమవుతాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే అల్లు అర్జున్ అభిమాన సంఘం మాత్రం సామాజిక అంశాలపై కూడా దృష్టి సారిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
హెచ్పీవీ టీకా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణపై సరైన సమాచారం అందరికీ చేరడం ఎంతో ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలికలు, యువతులకు వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో యువతను చేరుకోవడం విశేషంగా మారింది. మొత్తంగా 820 పాఠశాలలు, కమ్యూనిటీల్లో కార్యక్రమాలు నిర్వహించి సుమారు 3 లక్షల మంది బాలికలు, యువతులకు అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం అల్లు అర్జున్ అభిమానుల సామాజిక బాధ్యతను మరోసారి చాటిచెప్పింది.