Elimination | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిన్నటి ఎపిసోడ్లో హై రిస్క్‌లో పెట్టడం, ఇంటి పనులను టీమ్‌లకు విభజించుకోవడం వంటి టాస్క్‌లు జరగగా.. తాజాగా మరోసారి హై రిస్క్ టాస్క్‌తో పాటు తొలి ఎలిమినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించారు. ఈ క్రమంలో చరణ్ నాలుగో రోజే బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దేబ్జానీ టీమ్ నుంచి ముకేశ్, త్రిగుణ్.. రోహిత్ టీమ్ నుంచి రోహిత్, వంశీలను బిగ్‌బాస్ పిలిచారు. హౌస్‌మేట్స్‌గా అర్హత సాధించాలంటే తమ సొంత టీమ్‌లోని ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని ఆదేశించారు. దీంతో ముకేశ్, త్రిగుణ్ కలిసి తమ టీమ్ నుంచి కృష్ణుడిని హై రిస్క్‌లోకి పంపించారు. మరోవైపు రోహిత్, వంశీ తమ టీమ్ నుంచి చైత్ర రాయ్‌ను హై రిస్క్‌లో పెట్టారు.
ఈ నిర్ణయంలో రోహిత్ తనతో కలిసి అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారిని కాపాడుకున్నాడనే చర్చ మొదలైంది. చైత్రను హై రిస్క్‌లో పెట్టడంతో ఆమె తీవ్రంగా బాధపడింది.హై రిస్క్‌లోకి వెళ్లిన చైత్ర బాధపడుతుండగా.. మరోవైపు రోహిత్ టీమ్ సభ్యులు మ్యూజిక్, డ్యాన్స్‌తో సందడి చేయడం ఆమెను మరింత కలచివేసింది. సొంత టీమ్ తనను కష్టాల్లోకి నెట్టిందని చైత్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సమయంలో షాలిని, చైత్ర మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో చైత్ర భావోద్వేగానికి గురైంది. అనంతరం రోహిత్ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. హై రిస్క్‌లో ఉన్న చైత్ర, చరణ్, రామ్ ప్రసాద్‌లను బిగ్‌బాస్ మరోసారి పిలిచారు. వీరిలో ఒకరికి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పారు.
చరణ్, రామ్ ప్రసాద్ ఇద్దరూ చైత్రను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడంపై అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కొందరు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. చైత్రకు అవకాశం ఇవ్వకుండా వేరే నిర్ణయం తీసుకోవాలని చరణ్‌పై ప్రభావం చూపేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఇక చరణ్, రామ్ ప్రసాద్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించారు. ఇద్దరినీ నిలబెట్టి.. ఎవరు ఇంట్లో కొనసాగకూడదని భావిస్తున్నారో వారి ముఖానికి రంగు పూసి కారణం చెప్పాలని ఇంటి సభ్యులకు సూచించారు.ఈ ప్రక్రియలో చరణ్‌కు ఎక్కువ మంది సభ్యులు రంగు పూశారు. త్రిగుణ్, కృష్ణుడు, సుధీర్, వర్షిణి, వంశీ, ముకేశ్, దేబ్జానీ, నరేష్, ఝాన్సీ తదితరులు చరణ్‌కు వ్యతిరేకంగా నిలిచారు.
మరోవైపు రామ్ ప్రసాద్‌కు సృష్టి, షాలిని, అమన్, రోహిత్ రంగు పూశారు. చైత్ర హై రిస్క్‌లో ఉండటంతో ఆమెకు ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. ఎక్కువ ఓట్లు చరణ్‌కు రావడంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొలి ఎలిమినేషన్‌గా చరణ్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. నాలుగో రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ఇంటి సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. చరణ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. చరణ్‌ను ఎలిమినేట్ చేయడానికి ఇంటి సభ్యులు చెప్పిన కారణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. చరణ్ సొంతంగా ఆట ఆడటం లేదని, రోహిత్‌పై ఆధారపడుతున్నాడని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా ఒక గ్రూప్‌గా ఉండటం వల్ల చరణ్ తన వ్యక్తిగత ఆటను చూపించలేకపోతున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. చరణ్‌కు ఇంకా సమయం ఇస్తే తన ఆటను చూపించగలడని భావించినప్పటికీ.. ఎలిమినేషన్ ప్రక్రియలో మాత్రం అతనికి అనుకూలంగా ఫలితం రాలేదు.