Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ గొడవలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరి మధ్య.. సెప్టెంబర్ 10 ఎపిసోడ్లో గొడవ మరింత ముదిరింది. ఈసారి త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లడంతో చర్చ మొదలైంది. రోహిత్ బాడీ గురించి మాట్లాడుతూ త్రిగుణ్ చేసిన స్టెరాయిడ్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. బిగ్‌బాస్ ఇంట్లో రోహిత్‌కు గిన్నెలు కడిగే బాధ్యత ఇవ్వడంతో త్రిగుణ్ అతని పనిని పదేపదే గమనిస్తూ కనిపించాడు. గిన్నెలు సరిగా కడగలేదని, మరోసారి శుభ్రం చేయాలని రోహిత్‌కు చెప్పాడు.
అయితే రోహిత్ మాత్రం గిన్నెలు కనిపించినప్పుడు చెప్పాలని, తాను వచ్చి కడుగుతానని చెప్పాడు. దీనికి త్రిగుణ్ అంగీకరించలేదు. రోహిత్ గిన్నెలు కడుగుతున్న ప్రతిసారీ దగ్గరకు వెళ్లి పరిశీలించడం ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఒక సందర్భంలో కుక్కర్ స్క్రూ ఊడిపోవడంతో త్రిగుణ్ దాన్ని బిగించాడు. ఆ సమయంలో రోహిత్ చదువు, మార్కుల గురించి ప్రస్తావిస్తూ.. కేవలం బట్టీ కొట్టి మార్కులు తెచ్చుకోవడం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని వ్యాఖ్యానించాడు.దీంతో రోహిత్ కూడా త్రిగుణ్‌పై కౌంటర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇంట్లో ఎవరి సామర్థ్యం ఏంటో తెలుస్తుందని, రూల్స్ చదివి గేమ్ ఆడాలని అన్నాడు. ఇద్దరి మధ్య మాటలు మరింత పెరగడంతో త్రిగుణ్ రోహిత్ బాడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ బాడీ స్టెరాయిడ్స్ ఉపయోగించి తయారు చేసుకున్నదని అర్థం వచ్చేలా త్రిగుణ్ మాట్లాడాడు.
ఈ కామెంట్ రోహిత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. తాను స్టెరాయిడ్స్ ఉపయోగించి బాడీ బిల్డ్ చేసుకున్నానని ఎలా మాట్లాడతారని ప్రశ్నించాడు. ఒకరి బాడీ గురించి ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే రోహిత్ మాత్రం గొడవను మరింత పెంచకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చరణ్‌తో కూర్చుని త్రిగుణ్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాడు. ఇక్కడితో గొడవ ఆగలేదు. రోహిత్ కడిగిన గిన్నెను తీసుకొచ్చి అది సరిగ్గా కడిగావా అని త్రిగుణ్ ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ కూడా స్పందిస్తూ కెమెరాలను చూసి తనను నామినేట్ చేసుకోవాలని అన్నాడు. దీంతో త్రిగుణ్.. రోహిత్‌ను ‘పిల్ల బచ్చా’ అంటూ సంబోధించాడు. ఈ వ్యాఖ్యలపై కూడా రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కనీస గౌరవం ఉండాలని, ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని చెప్పాడు.
ఇక మరో సందర్భంలో ‘స్క్రిప్ట్’ అనే పదాన్ని తీసుకుని ఇద్దరి మధ్య మరో వాగ్వాదం జరిగింది. రోహిత్ తన సొంత స్క్రిప్ట్ రాసుకుని తనకు ఆపాదించవద్దని త్రిగుణ్‌తో అన్నాడు.అయితే త్రిగుణ్ మాత్రం రోహిత్ తన ప్రొఫెషన్, చదువు గురించి అవమానకరంగా మాట్లాడాడని ఇతర హౌస్మేట్స్ దగ్గర చెప్పినట్లు చూపించారు. ఈ విషయంలో అసలు ఎవరు ఏ సందర్భంలో ఏం అన్నారనే దానిపై ఇద్దరి వాదనలు భిన్నంగా ఉన్నాయి.రోహిత్‌తో త్రిగుణ్ పదేపదే గొడవ పడటం, ముఖ్యంగా అతని వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. గేమ్‌లో భాగంగా విమర్శలు చేయడం వేరు.. వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయడం వేరు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.