నల్లగొండ, జనవరి 9 : ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఐదు రోజులుగా డేటా ఎంట్రీ జరుగుతున్నప్పటికీ సర్వర్ సమస్యతో ఆలస్యమవుతున్నది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ జరుగగా, ఈ నెల 5 నుంచి ఆన్లైన్ డేటా ఎంట్రీ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11.52 లక్షల దరఖాస్తులు రాగా ఈ ఐదు రోజుల్లో 5.22 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయి. ఇంకా 6.30 లక్షలు ఆన్లైన్ చేయాల్సి ఉన్నది. అయితే ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం గ్యారెంటీలకు సంబంధించి మాత్రమే ఆన్లైన్ అవుతుండగా మిగిలిన దరఖాస్తులకు సైట్లో ఆప్షన్ లేకపోవడంతో వాటిని పక్కన పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, 71 మండలాల్లోని తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ ఆన్లైన్ ప్రక్రియ 3,845 మంది ఆపరేటర్లతో నడుస్తున్నది.
ఐదు పథకాలకే..
ప్రజా పాలన కార్యక్రమంలో ఐదు గ్యారెంటీల కింద మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుకు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆహార భద్రత కార్డుతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్లను జత చేశారు. చాలా మంది ఆశావహులు తమకు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశంతో తెల్ల కాగితంపై కుటుంబ సభ్యుల వివరాలు రాసి ఇచ్చారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డులు కావాలని 74వేల మంది, ఇతర బెన్ఫిట్స్ కావాలని మరో 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఐదు గ్యారెంటీలు కాక మరో 86,409 మంది ఇతర పథకాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఐదు పథకాలకు మాత్రమే ఆన్లైన్ చేసే ఆప్షన్ ఉండడంతో రేషన్ కార్డుతోపాటు ఇతర బెన్ఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న 86వేల దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలు ఎక్కువ ఉంటే డేటా ఎంట్రీ చేసే సమయంలో ఆలస్యమవుతున్నది.
అధికారుల పర్యవేక్షణలో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో 3,845 మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ నడుస్తున్నది. మండల స్థాయిలో తాసీల్దార్, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, ఆర్డీఓ లేని ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్, నోడల్ అధికారుల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ కొనసాగుతున్నది. ఈ నెల 17వ తేదీలోపు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకొని వేగంగా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ డేటా ఎంట్రీ జరుగుతున్న సమయంలో ఆయా మండలాలు, మున్సిపల్ కేంద్రాల్లోకి వెళ్లి కొందరు ఆశావహులు దరఖాస్తులు ఇస్తే తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.