తుంగతుర్తి, మే 14 : కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీలు సక్రమంగా కేంద్రాలకు రాకపోవడం, లోడింగ్ చేసి పంపిన లారీ మిల్లుల వద్ద సకాలంలో దిగుమతులు కాపోవడంతో రైతులు ధాన్యం కల్లాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి తెలిపారు.
ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మిల్లు యజమానులు తరుగు పేరుతో తాలు పేరుతో కిలోల కొద్ది కోతలు పెడుతుండడంతో రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని విమర్శించారు. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతు ధాన్యం సేకరించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్పందించి సకాలంలో రైతుల ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల నాగమల్లు, మాజీ సర్పంచ్ యాకూ నాయక్, పూర్ణ నాయక్, రాములు నాయక్, నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.