విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వేలకోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. జిల్లాలో 2019కి ముందు 89 పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో మూసివేయగా, 20 25 నాటికి అవి 298కి చేరింది. ప్రతి ఏడాది బాడిబాట నిర్వహిస్తూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు కృషి చేస్తున్నా, తల్లిదండ్రులు చేర్పించేందుకు ముందుకు రాకపోవడానికి కారణాలు విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనం.
రామగిరి, మే 27: ప్రభుత్వ విద్యపై ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వసనీయత పెంచే విధంగా విద్యాశాఖ, ఉపాధ్యాయులు కృషి చేయాలి. కానీ నల్లగొండ జిల్లాలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సర్కార్ బడులను బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారుల అలసత్వంతో జిల్లా వ్యాప్తంగా 298 ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు. జీరో ఎన్రోల్మెంట్తో పాఠశాలలు మూతపడ్డాయని అధికారులు చెబుతున్నప్పటికీ, ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సైతం తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి ముందుకు రావడంలేదు.
దీనికి గల కారణాలు తెలుసుకుని వాటిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించడంలో విఫలమవుతున్నారని పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో విద్యాశాఖకు వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఖర్చుచేస్తున్నా ఆ శాఖ అధికారులు బాధ్యతారాహిత్యంతో సరైన ఫలితం దక్కడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలో 2019కి ముందు 89 పాఠశాలలు విద్యార్థులు లేరనే సాకుతో మూసివేయగా, 2025 నాటికి 298కి చేరాయి. ప్రతి సంవత్సరం బాడిబాట నిర్వహిస్తూ ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు కృషి చేస్తున్నా, తల్లిదండ్రులు చేర్పించేందుకు ముందుకు రాకపోవడానికి కారణాలు విద్యాశాఖ వైఫల్యానికి దర్పణం పడుతుందని చెప్పవచ్చు.
మారుమూల గ్రామాలు, తండాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు పక్కా భవనాలు సైతం నిర్మించారు. అయితే ఆ స్కూళ్లలో ఉపాధ్యాయులు వంతుల వారీగా విధులకు హాజరవుతున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమ పిల్లలకు సక్రమంగా చదువురావడం లేదని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల మూసివేతలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలిచిందని విద్యావేత్తలు అంటున్నారు.
పెద్దఅడిశర్లపల్లి 16, గుడిపల్లి 3, పెద్దవూర 19, తిరుమలగిరి సాగర్ 17, నేరడుగొమ్మ 18, చందంపేట 36, దేవరకొండ 18, గుండపల్లి(డిండి) 17, గుర్రంపోడు 13, కొండమల్లేపల్లి 13, మిర్యాలగూడ 11, అడవిదేవులపల్లి 3, అమ్మనబోలు 3, అనుముల(హాలియా) 8, చండూరు 7, చింతపల్లి 9, చిట్యాల 3, దామరచర్ల 5, గట్టుప్పల్ 4, కనగల్ 8, కట్టంగూర్ 6, మాడ్గులపల్లి 3, మర్రిగూడ 8, మునుగోడు 6, నకిరేకల్ 2, నల్లగొండ 5, కేతేపల్లి 1, నాంపల్లి 7, నార్కట్పల్లి 5, నిడుమనూరు 6, శాలిగౌరారం 6, తిప్పర్తి 3, త్రిపురారం 9 ఉన్నాయి.