గరిడేపల్లి, జూలై 12 : వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గరిడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని రికార్డులను పరిశీలించి పలు విషయాలపై ఆరా తీశారు. దవాఖానలో లేని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖాన ఆవరణను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానకు వచ్చే వారికి సరైన పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా మందులు అందించాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ విద్యార్థులను క్రమశిక్షణతో నడుచుకునేలా చేయాలన్నారు. అలాగే తాసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి తాసీల్దార్‌ను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సైతం పరిశీలించారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజాపాలన సహాయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ బి.కవిత, ఇన్చార్జి ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.
గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. పాఠశాల వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం ఇంటర్మీడియట్ ఫస్టియర్ తరగతి గదిలో ఫిజిక్స్ అధ్యాపకుడు రవీందర్‌నాయక్ పాఠం బోధిస్తుండగా ఆ తరగతి గదిలోకి వెళ్లి బోధిస్తున్న పాఠానికి సంబంధించిన పలు విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చాక్‌పీస్ పట్టి బోర్డుపై రాస్తూ వేగం, త్వరణం, స్థానభ్రంశంపై 35 నిమిషాలపాటు బోధించారు. అలాగే ఫిజిక్స్‌లోని ఓ ప్రాబ్లమ్‌ను చేసి విధ్యార్థులకు స్వయంగా వివరించారు. ఫార్ములాలను తేలికగా గుర్తించుకునే విధానాల గురిం చి చెప్పారు. కలెక్టర్ అధ్యాపకుడై పాఠం బోధించడంతో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. సమస్యలపై పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వీరబాబు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.