యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన వాటాను సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ జల దోపిడీపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొత్తుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నా నీటి బాధలు తప్పడం లేదన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన వాటాను మనం వాడుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. 2002 సంవత్సరంలో వేల ట్రాక్టర్లతో రైతులంతా కృష్ణా బ్యారేజ్‌పై నిరసన వ్యక్తం చేశారని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఏ విధమైన పోరాటానికైనా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని, ఆయన మొద్దు నిద్ర వీడి జనానికి మేలు చేయాలని సునీతామహేందర్ రెడ్డి అన్నారు. బస్వాపురం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని చెప్పారు. 11 టీఎంసీల నీటిని నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నా రూ.109 కోట్లను కూడా విడుదల చేయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే మన ప్రాంతం గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతుందని వివరించారు. ఇందు గాను రూ. 50 కోట్లు కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయని, మిగిలిన రూ.60 కోట్లు విడుదల చేయించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బీరు మల్లయ్య, పెంట నరసింహ కాజా ఆజిముద్దీన్, బబ్లు వీరేశం తదితరులు పాల్గొన్నారు.