ఆలేరు టౌన్, డిసెంబర్ 10 : ఆలేరు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లా మారాయని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని బహదూర్‌పేట మాజీ సర్పంచ్ జంపాల దశరథపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని స్థానిక బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారు నిరసన తెలిపారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో, ఆ పార్టీ నేతలకు పోలీసులకు తొత్తులుగా మారి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గోశాలపై పలువురితో దాడికి పాల్పడిన కూళ్ల నర్సింహులుపై పోలీస్‌స్టేషన్‌లో మాజీ సర్పంచ్ జంపాల దశరథ ఫిర్యాదు చేయగా, తిరిగి దశరథపైనే పోలీసులు కేసు నమోదు చేసి రాత్రి 2 గంటల వరకు స్టేషన్లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా నర్సింహులు భార్యను చెయ్యి పట్టి లాగాడని దశరథపై పోలీసు కేసు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులను టార్గెట్ చేసి పోలీసులు దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లమని.. కేసులకు, జైళ్లకు భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. పోలీసులకు జీతాలు ప్రజలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కాదని గుర్తు పెట్టకోవాలని హితవు పలికారు. ఏసీపీ రమేశ్, సీఐ కొండల్రావు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కాంగ్రెస్ పైరవీకారులే కనిపిస్తున్నారని విమర్శించారు.
గోశాలపై దాడికి పాల్పడిన వారిపై వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి 50వేల మంది కార్యకర్తలతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాటేపల్లి మాజీ సర్పంచ్ మంత్రి రాజును ఏసీపీ రమేశ్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి కేసులు పెడతానంటూ రెండు సార్లు హెచ్చరించారన్నారు. గ్రామంలో టైర్ల కంపెనీ పెడితే వాతావరణం కాలుష్యం అవుతుందని అడ్డుకుంటే కేసు పెడుతామని ఏసీపీ బెదిరించడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశంగౌడ్, యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు గంగుల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మొగాలగాని మల్లేశం, వైస్ చైర్మన్ చంద్రకళ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, పోరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ, కౌన్సిలర్ బేతి రాములు, మాజీ సర్పంచ్‌లు ఆరుట్ల లక్ష్మీపతిరెడ్డి, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, జంపాల దశరథ, బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్, కందుల రామన్న, పాశికంటి శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, పంతం కృష్ణ, దయ్యాల సంపత్, ఎండీ ఫయాజ్, పూల శ్రవణ్, కటకం బాలరాజు పాల్గొన్నారు.