యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో గుట్టకు మూడుసార్లు వచ్చినా అభివృద్ధిపై నోరు మెదుపలేదని మండిపడ్డారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం దివ్య విమాన గోపురం మహాకుంభ సంప్రోక్షణ శాస్త్రపరంగా జరుగలేదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రులు లేకుండానే సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే హాజరై స్వర్ణ విమానగోపురాన్ని ప్రారంభించారని తెలిపారు. దేశానికే తలమానికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రూ.1,300 కోట్లతో ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
పూర్తి కృష్ణశిల కూడిన అద్భుతమైన నిర్మాణమని అస్ట్రేలియా దేశం గ్రీన్ ఆపిల్ అవార్డు ప్రకటించిందని తెలిపా రు. పట్టణంలో కొందరికి ఇబ్బంది కలిగినా చుట్టూ రహదారులు, కొండ కింద పుష్కరిణి, గండిచెరువు, సత్యనారాయణ వ్రత మండపం, పార్కింగ్, చుట్టూ రహదారులతోపాటు భక్తులకు అవసరమైన అన్ని వసతులు బీఆర్ఎస్ ప్రభుత్వమే కల్పించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వామివారి ఆదాయాన్ని ఇతర అవసరాలను వినియోగించారే తప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలల కావస్తున్నా గుట్ట అభివృద్ధిపై ఒక్క సమీక్ష కూ డా జరుపలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆలయ పునఃప్రారంభోత్సవ సమయంలో జరిగిన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతోపాటు పార్టీలకతీతంగా అందరినీ ఆహ్వానించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ఆలయ పునర్నిర్మాణంలో ఆహోరాత్రులు శ్రమించిన ప్రధాన స్తపతి సుందరరాజన్, స్తపతి సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ ఆనందాచార్యుల వేలు, డిప్యూటీ స్తపతి మోతీలాల్తోపాటు 13 మంది ఇతర డిప్యూటీ స్తపతులకు స్వర్ణ విమానగోపురం పునఃప్రారంభోత్సవ ఆహ్వానం లేకపోవడం దారుణమన్నారు. విమానగోపురం స్వర్ణమయం చేయాలన్న ఆలోచన కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. స్వర్ణతాడపంలో ప్రజలను భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో విరాళాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారని తెలిపారు. అప్పట్లోనే చాలామంది దాత లు విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారో ఈఓ స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణలో నష్టపోయిన 140 మంది బాధితులకు 60 షాపులను కేటాయించామన్నారు. ఆ షాపులకు నేటికీ విద్యుత్‌తోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించలేకపోవడం దారుణమన్నారు.
ఎంట్రీ ఫ్లైఓవర్ నిర్మాణం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. కల్యాణకట్టలో స్థానికులకు న్యాయం జరుగలేదని, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఉద్యోగాలను కట్టబెట్టారని తెలిపారు. టెంపుల్ సిటీపై డోనర్ కాటేజీలను నిర్మించాలని లే అవుట్ చేస్తే కనీసం నిర్మించాలన్న ఆలోచన సీఎం, మంత్రి, ఎమ్మెల్యేకు రావడం లేదని విమర్శించారు. స్వామివారిపై సీఎం రేవంత్‌రెడ్డికి భక్తి లేదని, మొక్కుబడిగా వచ్చిన్నట్టు ఆయన పర్యటన కనిపిచిందని తెలిపారు. ఆదాయాన్ని పెంచాలంటే విస్తృత ప్రచారం అవసరమని, గుట్టపై ఎందుకు ప్రచారం చేయడం లేదో ఈఓ చెప్పాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. రాబోయే ఉత్సవాల్లో ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, మాజీ కౌన్సిలర్ బూడిద సురేందర్, బీఆర్ఎస్ పట్టణ నాయకుడు ఆరే శ్రీధర్‌గౌడ్, ఎండీ యాకుబ్ పాల్గొన్నారు.