ఆలేరు టౌన్, నవంబర్ 11 : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరులోని రహదారి బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. గ్యాస్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2,500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటిపై సంక్షేమ పథకాలపై ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
ప్రతి రైతుకూ పూర్తిగా రుణమాఫీ చేశామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి నివేదిక పంపగా, మరుసటి రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 20 లక్షల మందికి రుణమాఫీ చేశామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హాయంలో నాడు మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన సమయంలో ఎవ్వడికి పడితే వాడికి సమాధానం చెప్పాల్సిన పని లేదన్న రేవంత్‌రెడ్డి తాజా సర్వేపై ఏం చెప్తారని ప్రశ్నించారు.
కుల గణనలో 112 కాలమ్స్ ఉన్నాయని, విశ్వబ్రాహ్మణనులు బీసీ కేటగిరీలోకి రాగా, శిల్పులు, కంచర, సంచార జాతులు, మొదలగు కులాల వారు ఏ కేటగిరీలోకి వస్తారో స్పష్టత లేదన్నారు. కుల గణనలో పిలల్ల మొబైల్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆస్తులు, అప్పులు అడగడం హాస్వాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మాజీ వైస్ ఎంపీపీ కొరుకొప్పుల కిష్టయ్య, కోటగిరి పాండరి, పత్తి వెంకటేశ్, బండ జహంగీర్ పాల్గొన్నారు.