యాదగిరిగుట్ట, ఆగస్టు 11: పాడి రైతులకు చెల్లించాల్సిన 6 పెండింగ్ బిల్లులను ఈనెల 20లోగా చెల్లించకపోతే వెయ్యి మంది పాడి రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. విజయా డెయిరీని ప్రొత్సహిస్తూ నార్ముల్ డెయిరీపై కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దిగుతోందని మండిపడ్డారు. సోమవారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో నార్ముల్ డెయిరీ డైరెక్టర్, పాల సంఘం చైర్మన్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి హయాంలో పాడి రైతులకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడంతోపాటు లీటరు పాలకు రూ. 4 బోనస్ కూడా అందజేసి పాడి రైతులకు అండగా నిలిచామన్నారు. డెయిరీలో పనిచేసే 400 మంది ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అమలు చేయలేని హామీలిచ్చి నార్ముల్ ఎన్నికల్లో గెలిచి మాట మార్చారన్నారు. విజయా డెయిరీకి రూ. 30 కోట్ల గ్రాంట్ ఇచ్చిన సీఎం నార్ముల్ డెయిరీకి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.
నార్ముల్ సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించి మూసివేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చూస్తున్నారని అన్నారు. గతంలో రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, చెర్వుగట్టుతో పాటు పలు ప్రధాన ఆలయాలకు నెయ్యిని సరఫరా చేసిన నార్ముల్ సంస్థ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్నింటిని రద్దు చేసి విజయా డెయిరీకి అప్పగించిందన్నారు. ప్రస్తుతం యాదగిరిగుట్టకు నెయ్యి సరఫరా చేస్తున్నా అధికారికంగా జీవో లేదన్నారు.
ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పలేమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులంతా ప్రత్యామ్నాయంగా పాడిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో పాడి పరిశ్రమ బాగా అభివృద్ది చెందిందన్నారు. ప్రస్తుతం పశువుల దాణా ధర పెరగడంతో గిట్టుబాటురాక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత మూడు నెలలుగా 6 బిల్లులు రాక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
పాడి రైతుల పొట్టకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. ఇదే జరిగితే ప్రభుత్వంపై యుద్ధానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. కార్యక్రమంలో నార్ముల్ డెయిరీ డైరెక్టర్లు కందాల అలివేలు రంగారెడ్డి, కస్తూరి పాండు, మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, ఒగ్గు బిక్షపతి, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్‌రెడ్డి, సందీళ్ల భాస్కర్‌గౌడ్, పుప్పాల సిద్దులు, దడిగే మధు, సతీశ్‌రెడ్డి, కొంతం వెంకట్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.