యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్ర అవమానకర చర్యగా ఆయన అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుట్ట దేవస్థానానికి సంబంధంలేని 20 మందికి పైగా వ్యక్తుల ఫొటోలు ముద్రించి, కేసీఆర్ను ఎలా విస్మరిస్తారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత అని, ఆయనకు ప్రొటోకాల్ కూడా అడ్డురాదని, ఫొటో ముద్రించి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేదని అన్నారు. కేసీఆర్ హయాంలో రూ. 1200 కోట్లతో కనీవినీ రీతిలో గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించారని గుర్తు చేశారు. కేవలం 10 శాతం నిధులు కేటాయిస్తే పెండింగ్ పనులు పూర్తవుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెడ్లు పోయినా కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకున్నా ఏదో చేసినట్లు గొప్పలు చెప్పుకొంటున్నదని విమర్శించారు.
ప్రపంచ సుందరీమణులు సందర్శనకు వస్తే ఆలయ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ సృష్టించిన సంపదను కొల్లగొట్టేందకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరాట పడుతున్నారన్నారు. దేవస్థానంలో ప్రొటోకాల్ నిబంధనలు పాటించడంలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపనలు చేస్తున్నారని, కొన్ని చోట్ల భూమి పూజ చేసిన వాటికే సిగ్గులేకుండా మళ్లీ చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదగిరిగుట్టలో గతంలో మంజూరైన పనులకు తాజాగా మళ్లీ శంకుస్థాపన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతున్నదని, అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ కంటితుడుపుగా అమలు చేసిందని, ఏదీ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా యూత్ ఐకాన్ ర్యాలీకి విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 4వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయని, అన్ని కమిటీలు, వర్గాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.