నల్లగొండ : వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో రూ.200 ఇవ్వడానికే తీవ్ర ఇబ్బంది పడిన ఘటనల నుంచి నేడు రూ.3వేల వరకు పెన్షన్లు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండిన పేదలందరికి 10 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. డయాలసిస్ రోగులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం తీసుకోవడం పట్ల స్వాగతిస్తున్నామని అన్నారు.