నల్లగొండ, డిసెంబర్ 01 : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్‌తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. అలాంటి వారు నామినేషన్ల పరిశీలన సమయం వరకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించే విధంగా తెలియజేయాలన్నారు. రెండవ విడత నామినేషన్లలో భాగంగా సోమవారం ఆమె పెద్దవూర గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలని, 5 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేసేందుకు అనుమతించవద్దని ఆదేశించారు.
బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో పాటు, నామినేషన్ పత్రంలో అన్ని ఖాళీలు సంపూర్ణంగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. హెల్ప్ డెస్క్ లో ఉన్న వారు, ఆర్వో వీటన్నిటిని తెలియజేసేలా ఉండాలని సూచించారు. నామినేషన్ల వివరాలను జాప్యం లేకుండా పంపించాలని, టీ పోల్ లో అప్లోడ్ చేయడం, జిల్లా కేంద్రానికి పంపించడంలో జాప్యం చేయవద్దు అన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎంపీడీఓ ఉమాదేవి, తాసీల్దార్ శ్రీదేవి, ఎంఈఓ రాము, ఆర్ఐలు శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ ఉన్నారు.