గరిడేపల్లి, ఏప్రిల్ 12 : కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వుకు చెందిన సైదులు. అందరిలా ఆటలు ఆడాలనే సంకల్పం ఉన్నా అంగవైకల్యం అడ్డొచ్చింది. తనతో చదివిన స్నేహితులు వాలీబాల్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంటే దివ్యాంగుడిగా ఊరికే పరిమితమవ్వాలా? అనే ఆలోచనలు ఆయనలో కసిని పెంచింది. దాంతో ఎలాగైనా ఆటల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాలలో తోటి స్నేహితులతో ఆటలు ఆడడం మొదలుపెట్టాడు. దివ్యాం గుడంటూ స్నేహితులు అవమానిస్తున్నా పట్టుదలతో మరింత ప్రాక్టీస్ చేశాడు. వైకల్యం అనేది శరీరానికే గానీ మనస్సుకు కాదని మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. దాంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు విభాగాల్లో జాతీయ స్థాయి పారా క్రీడలకు ఎంపికై గుర్తింపు తెచ్చుకున్నాడు సైదులు.
కల్మల్చెర్వు గ్రామానికి చెందిన అమరారపు నగేశ్, ఈశ్వరమ్మ దంపతులకు నలుగురు సం తానం. హరిజనవాడలో నివాసం ఉంటున్న వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయిలలో పెద్దవాడు సైదులు. పుట్టుకతోనే కాలుకు పోలియో రావడంతో నడవడం కష్టతరమైంది. నిరుపేద కుటుంబం కావడంతో కొడుకును ఎలా సాకాలి, చదివించాలనే ఆలోచనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే ఇల్లు ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరగా ఉండడంతో ప్రారంభంలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించి రోజూ ఎత్తుకెళ్లి పాఠశాలలో దింపి వచ్చేవారు. అలా అతికష్టం మీద ఐదో తరగతి పూర్తి చేశాడు. తదుపరి హైస్కూల్ ఇంటికి మరింత దగ్గరగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజం పడింది ఇలా..
2003-04 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో జాయిన్ కాగానే అప్పటికే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న మైలారిశెట్టి సత్యనారాయణ విద్యార్థులకు క్రీడల్లో మెళకువలు నేర్పిస్తున్నాడు. వారిని చూసి ప్రేరణ పొందిన సైదులుకు వైకల్యం అడ్డువచ్చింది. కానీ గ్రామంలో సుమారు 70 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంతో సమాజంలో వారికి వచ్చిన గుర్తింపును గమనించిన సైదు లు ఎలాగైనా క్రీడల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆటలు మొదలుపెట్టాడు.
నిరాశే మిగిలింది
పదో తరగతి పూర్తయ్యే నాటికి కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాడు. అయితే వికలాంగుడు కావడంతో అతను కాంపిటీషన్‌కు పనికిరాడని ఎక్కడ ఆడనీయలేదు. దాంతో నిరాశకు గురయ్యాడు. ఒక దశలో ఈ ఆటలతో మనకు ఒరిగేది ఏమీ లేదు. వీటిని వదిలేద్దామని నిర్ణయం తీసుకున్నాడు.
పునః ప్రారంభానికి కారణం స్నేహితులే..
ఆటలతో సాధించేది ఏమీ ఉండదనకున్న సైదులు.. చదువుపై దృష్టి సారించాడు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. తదుపరి ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)ఉస్మానియా యూనివర్సిటీలో సీటు పొందాడు. అక్కడ వికలాంగులకు పారా క్రీడలు ఆడిస్తారనే విషయం తెలియడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో తనకు దగ్గరి స్నేహితులు కలిసినప్పుడల్లా ఆటల గురించి ఆరా తీసేవాడు. ఈ క్రమంలో నల్లగొండలోని మిత్రులు గురుస్వామి, శంకర్, బుచ్చిరాములును కలిసి చర్చించగా పారా క్రీడలకు మార్గాన్ని చూపించారు. కొంత కాలానికే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పారాగేమ్స్ ఎంపికకు సంబంధి ప్రకటన రాగా దరఖాస్తు చేశాడు.
ఎంపిక జరిగింది ఇలా…
2018లో మొదటి సారిగా సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పారా కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్నాడు. అక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రెండు క్రీడలకు ఒకేసారి రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నైలో పారా కబడ్డీ పోటీల్లో ఆడాడు. 2022లో చెన్నైలో రాష్ట్ర పారా కబడ్డీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో సన్మానం పొందాడు. షాట్‌ఫుట్, జావెలిన్త్రోకు సైతం ఎంపికైనప్పటికీ వాటిని ప్రారంభంలోనే వదులుకున్నాడు.
ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
సైదులుది నిరుపేద కుటుంబం కావడంతో అతను కజకిస్థాన్ వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నాడు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. సుమారు రూ. 2.20 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు తనకు సహకరించాలని వేడుకుంటున్నాడు. సాయం చేయాలనుకునేవారు అక్కౌంట్ నంబర్ 62118877705, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0021595, ఎస్బీఐ, గరిడేపల్లి బ్రాంచ్‌లో నగదు, 9640670924 నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పే చేయవచ్చన్నాడు.
వాలీబాల్‌పై మక్కువతో..
సైదులుకు వాలీబాల్‌పై ప్రత్యేక అభిమానం ఉండడంతో అతని దృష్టంతా వాలీబాల్పైకే మళ్లింది. దాంతో రాష్ట్ర జట్టుకు ఎంపికై హర్యానా రాష్ట్రంలోని బివాని, కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి, తమిళనాడులోని తంజావూరులో జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు. తంజావూరు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో సైదులును పారా ఒలింపిక్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (పీవీఎఫ్ఐ) చైర్మన్ చంద్రశేఖర్ జాతీయ టీం సభ్యుడిగా ఎంపిక చేశాడు. దాంతో జూలై 3 నుంచి 8 వరకు కజకిస్థాన్‌లో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడారత్న అవార్డుకు ఎంపికై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
దేశం తరఫున ఆడడమే చిరకాల కోరిక
ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలన్నదే నా చిరకాల కోరిక. ఇందుకోసమే ఇన్నాళ్లూ కష్టపడ్డా. వాలీబాల్‌లో నా కష్టానికి ఫలితం దక్కింది. కానీ, నా కలకు పేదరికం అడ్డుగోడగా నిలిచింది. జాతీయ జట్టుకు ఎంపికైన నేను జూలై 3 నుంచి 8 వరకు కజకిస్థాన్‌లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు దాతలు సహకరించాలని వేడుకుంటున్నా.
– అమరారపు సైదులు, పారా వాలీబాల్ క్రీడాకారుడు