– 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేశ్
నీలగిరి, మే 02 : ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శనివారం నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేశ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్లో గల ఉడిపి హోటల్ పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, త్రాగడం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో ఉడిపి హోటల్, దుర్గా వైన్స్ మధ్య వీదిలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు వ్యక్తులు అక్కడ నిలబడి మాట్లాడుతూ పోలీసులను చూపి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పట్టుకోగా గంజాయి వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.
నిందితులను నల్లగొండ పట్టణానికి చెందిన కోరేపల్లి అభినవ్, రాములబండకు చెందిన సింగపంగా రాకేశ్ @ రాఖీ, భదాద్రి కొత్తగూడెంకు చెందిన మల్లె మోహన్ కృష్ణ, ధరావత్ రాజేశ్, నల్లగొండలోని ఆర్టీసి కాలనీకి చెందిన బత్తుల శివ సాయి @ బొబోలుగా గుర్తించినట్లు వెల్లడించారు. వీరితో పాటు అక్రమ రవాణాలో పాలుపంచుకున్న కస్పారాజు నాగరాజు, గంటెకంపు మధు కుమార్, జూలకంటి విష్ణు వర్ధన్, సంపత్ కుమార్, సుశాంత్ @ దేడ్లి, మనుకర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 5 కేజీల గంజాయిని కొత్తగూడెంకు చెందిన ఇద్దరికి, నల్లగొండ పట్టణానికి చెందిన మరొకరి అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ యర్రా సైదులు, హెడ్ కానిస్టేబుల్ పి.రాజు, కానిస్టేబుల్ బాలకోటి, ఎండీ షకీల్, సతీష్ ఉన్నారు.