– 300 గ్రాముల గంజాయి, రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నీలగిరి, మే 09 : నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుండి 300 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం హైదరాబాద్ రోడ్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. టూటౌన్ ఎస్ఐ యర్రా సైదులు తన సిబ్బంది బాలకోటి, షకీల్‌తో కలిసి పర్యటిస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు రెండు బైకులపై అక్కడ అనుమానాస్పదంగా నిలబడి ఉండడంతో వారిని విచారించేందుకు ప్రయత్నించగా పారిపోవడానికి యత్నించారన్నారు. వెంటనే అప్రమత్తమై వారిని చేదించి ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు.
వారిని విచారణ చేయగా హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్ @ ముజీబ్, మహమ్మద్ సోహెల్, షేక్ లతీఫ్ గా గుర్తించినట్లు చెప్పారు. పారిపోయిన వ్యక్తి రవీంద్రనగర్ కు చెందిన రౌడీషీటర్ బంటు-కార్తీక్‌గా తెలిసిందన్నారు. వారిని సోదా చేయగా వారి వద్ద 300 గ్రాముల గంజాయి లభించినట్లు వెల్లడిచంఆరు. పరారీలోన్న బంటు కార్తీక్ ఇతర ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసి వీరికి సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. నిందితులు స్వయంగా గంజాయి సేవించడమే కాకుండా, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ను రూ.500లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పరారీలోన్న బంటు కార్తీక్ పై గతంలో అనేక క్రిమినల్ కేసులు నమోదై కాగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై రౌడీషీట్ కూడా ఉందని, మహమ్మద్ అబ్దుల్ నయీమ్ పై గతంలో హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ వై.సైదులు, సిబ్బంది ఎల్.బాలకోటి, ఎండీ.షకీల్, మహేష్, వీరాంజనేయుల పాల్గొన్నారు.