హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిషేధిత జాబితాలోని భూముల వివరాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. 22ఏలో ఏ భూములు చేర్చాలన్న అంశమై 2015 డిసెంబర్ 23న హైకోర్టు సుదీర్ఘమైన తీర్పు ఇవ్వడంతో పాటు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు గుర్తు చేశారు. ఆ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు సెక్షన్ 22(1), (ఏ), (బీ), (సీ), (డీ), (ఈ)లకు సంబంధించిన భూముల వివరాల జాబితాను తయారుచేయడంతో పాటు భూ భారతి నిషేధిత జాబితాలో అప్లోడ్ చేసినట్టు తెలిపారు. అయితే ఆ జాబితాలో అవకతవకలు జరుగడం, అనేకమంది రైతుల పట్టాభూములు వారి ప్రమేయం లేకుండానే చేర్చడం వివాదాస్పదమైనట్టు చెప్పారు.
నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకూ సంబంధించిన నిషేధిత జాబితాను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి తగు నివేదిక సమర్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించారు. రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేశ్ పొద్దార్ మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయాన్ని ప్రజలకు తెలియపరచకుండా ముందుకు వెళ్లొద్దని సూచించారు. ప్రజల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని వాటిని సరి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిషేధిత జాబితా అంశంలో ఆన్లైన్ లేదా ఎమ్మార్వో దగ్గరికి వెళితే సమస్య పరిషారం అయ్యే పరిస్థితి లేదన్నారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ అంశంపై ముందుకు వెళ్లాలని చెప్పారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై గ్రామసభలు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్, విశ్రాంత రెవెన్యూ అధికారుల సంఘం చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ జయప్రకాశ్‌రావు, అడ్వైజర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షుడు వీ బాల్‌రాజ్, ఎం రవీందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.