కవాడిగూడ, ఆగస్టు 14: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు సచివాలయం ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ మహిళా నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మహిళా విభాగం సీనియర్ నాయకురాలు సుమిత్ర, మాజీ కార్పొరేటర్లు సునీత, హేమలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థపాలనతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కేసులు వేసి స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు హాజరు కానందుకే ఈ పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, ఈ పథకాలను ఎత్తేసేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.