చౌటుప్పల్, జూన్ 26 : ఒడిశా నుంచి మహారాష్ర్టాలోని షోలాపూర్‌కు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు కలిసి మంగళవారం రాత్రి పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 80.30లక్షల విలువైన 280 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ తరుణ్‌జోషి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భోసలే అబా మశ్చీంద్ర, అవినాశ్ శివాజీ రాథోడ్, సిద్ధరామేశ్వర్ పూజారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అదే రాష్ర్టానికి చెందిన మరో స్నేహితుడు అజయ్ రాథోడ్ తేజతో కలిసి గంజాయిని సేకరించి విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించడానికి పధకం వేశారు.
ఈ క్రమంలో గతంలో ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా అలిమెల తహసీల్‌లోని ఆలూరికోట నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని విక్రయించి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించారు. దాంతో గంజాయి కోసం ఈ నెల 23న మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి మళ్లీ ఆలూరికోటకు వెళ్లారు. అక్కడ గంజాయి తీసుకొని దొంగ నెంబర్ ప్లేట్లు ఉన్న ఇన్నొవా, స్విఫ్ట్ డిజైర్‌లో ఆజయ్ తేజ సహకారంతో తరలిస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ రహదారి మీదుగా వెళ్తుండగా.. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా పట్టుకున్నారు. వారి నుంచి రూ.80.30లక్షల విలువైన 280 కిలోల ఎండు గంజాయి, రెండు కార్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.