భక్తులతో పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పలుచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు శోభాయాత్రగా తీసుకెళ్లి నదీ తీరాలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.
నందికొండ, సెప్టెంబర్ 22 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన గణనాథులు ఐదో రోజు పలుచోట్ల నిమజ్జనానికి తరలాయి. నందికొండ పైలాన్ కాలనీలోని కొత్త వంతెన వద్ద కృష్ణానదిలో వినాయక నిమజ్జనాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎడమ కాల్వకు నీటి విడుదల లేనందున నందికొండ మున్సిపాలిటీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి సాగర్‌కు తీసుకొస్తున్నారు.
గత ఏడాది ఎడమ కాల్వకు నీటి విడుదల ఉన్న సమయంలో సుమారు 500కు పైగా విగ్రహాలు నందికొండకు వచ్చాయి. ఈ సారి నీటి విడుదల లేనందున హాలియా, పెద్దవూర, తిరుమలగిరి మండలాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వెయ్యికి పైగా నందికొండకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పైలాన్ కొత్త వంతెన వద్ద ఏర్పాట్లు చేశారు. గురువారం కొత్త వంతెన వద్ద బారికేడ్లు, క్రేన్, విగ్రహాల నిమజ్జన స్టేజీతోపాటు బందోబస్తును ఏర్పాటు చేశారు. నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్, హిల్కాలనీల్లో ఈ సారి 36 గణేశ్ విగ్రహాలు కొలువుదీరాయి.