ఉచిత కరంట్పై కుట్రలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం ఆగ్రహం కొనసాగుతూనే ఉన్నది. వరుసగా మూడో రోజూ ఎక్కడికక్కడే వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా అంతటా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టారు. సమైక్య పాలనలో 9గంటల కరంట్ ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం 24 గంటల ఉచిత కరంట్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం గ్రామాల్లోని రైతు వేదికలతోపాటు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నశించాలంటూ నినాదాలు చేశారు. దేవరకొండలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పెద్దవూరలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మునగాల, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళనల్లో కదం తొక్కారు. ఉచిత విద్యుత్ వద్దు, రైతు బంధుకు హద్దు, ధరణి రద్దు
అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతు వ్యతిరేక ప్రకటనలను ఇక చూస్తూ ఊరుకోం అని అల్టిమేటం జారీ చేశారు.
నల్లగొండప్రతినిధి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి 8గంటల కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మూడో రోజూ వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. గురువారం రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎక్కడికక్కడే నిరసనలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. సబ్స్టేషన్ల ఎదుట దిష్టిబొమ్మలకు దహన సంస్కారాలు నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. చిట్యాల మండలం వెల్మినేడు సబ్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు.
మధ్యాహ్నం నకిరేకల్ మెయిన్ సెంటర్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే లింగయ్య రోడ్డుపై బైఠాయించారు. పెద్దవూరలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఆందోళనలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు క్రేన్ సాయంతో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేశారు. అనంతరం దహనం చేశారు. హుజూర్‌నగర్‌లో నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలేరు పట్టణంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. మిర్యాలగూడ మండలం అవంతిపురం సబ్‌స్టేషన్ వద్ద రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు.