– సిపిఐ ఆధ్వర్యంలో నల్లగొండలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
రామగిరి, మే 16 : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శిస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం భారీ పన్నులు విధిస్తూ ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు. రవాణా ఛార్జీలు పెరగడంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, సహాయ కార్యదర్శి విశ్వనాథుల లెనిన్, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, సీనియర్ నాయకులు ముండ్ల ముత్యాలు, ఎస్.కె.మధార్, బాసాని వెంకటయ్య, పుట్టల సుజాత, జగన్, సర్దార్, గునా నారాయణ, ఎం.నందం, ఆర్.సీతారాములు, చాంద్ పాషా, వలికి వెంకటేశం, పంజాల నరసింహ, కందికట్టి ఎల్లయ్య, ఓర్పు అంగయ్య, అంజయ్య, జె. విజయ, మద్దిమడుగు పార్వతమ్మ, చిత్రం, రజిత, మాధవి, రాములమ్మ, జ్యోతి పాల్గొన్నారు.