రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూనే వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. ఆపద సమయంలో తమకు తాము రక్షించుకునేలా తయారు చేయాలని భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో నిపుణులైన శిక్షకులతో కరాటే వంటి (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రోజూ సాయంత్రం ఒక గంట పాటు సమయం కేటాయించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 560 ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతున్నది. సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థినులు తమలో ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యం పెరిగిందని చెప్తున్నారు.
– రామగిరి, మార్చి 7
నల్లగొండ జిల్లాలో 246, సూర్యాపేటలో 163, యాదాద్రి భువనగిరి జిల్లాలో 151.. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 560 ప్రభుత్వ, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. నెల రోజుల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణ చాలా పాఠశాలల్లో ఇప్పటికే పూర్తయింది. మిగతా స్కూళ్లలో ఈ నెలలో పూర్తి కానుందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్ల్లా వ్యాప్తంగా కరాటే శిక్షణను విద్యా శాఖ సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి (జీసీడీఓ) పి.సరిత పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక అధికారులతో తనిఖీలు చేస్తూ సక్రమంగా కొనసాగేలా చూస్తున్నారు. కరాటే శిక్షణలో ముఖ్యంగా వివిధ అంశాల్లో ఎదురయ్యే ఘటనలపై ఆత్మరక్షణలో బాలికలకు మెళకువలు నేర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు పాఠశాలకు కాలినడకన వచ్చి పోయే సమయంలో ఎలాంటి ఆపద వచ్చినా తక్షణ ఆలోచనతో అధిగమించి కాపాడుకునేలా శిక్షణ ఇస్తున్నారు.
కరాటే నేర్పించడం సంతోషకరం..
కరాటే శిక్షణకు హాజరయ్యేందుకు తొలి రోజు కొంచేం భయమేసింది. తర్వాతి రోజుల్లో ధైర్యంతో వచ్చి శిక్షణ నేర్చుకున్నా. కేజీవీబీలోని విద్యార్థినులకు విద్యతో పాటు ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఇవ్వడం సంతోషకరం. కరాటే శిక్షణ ఇస్తున్నారంటే మా అమ్మానాన్న మంచిదే నేర్చుకో బిడ్డ అన్నారు. నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలలో రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. మా టీచర్లు, ఎస్ఓ మేడం సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
– పి.శైలజ, 9వ తరగతి, కేజీబీవీ, మిర్యాలగూడ
పిల్లలు ఉత్సాహంగా నేర్చుకున్నారు
ఆత్మరక్షణ కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో మా పాఠశాలలో అందించిన కరాటే శిక్షణను పిల్లలు ఉత్సాహంతో నేర్చుకున్నారు. నెల రోజులపాటు నిపుణులైన మాస్టర్‌తో సాయంత్రం వేళ టీచర్ల పర్యవేక్షణలో శిక్షణ అందించాం. దీంతో తమను తాము రక్షించుకునేలా ఆత్మైస్థెర్యం పెరిగిందని విద్యార్థినులు దృఢ సంకల్పంతో ఉన్నారు. రోజూ టీచర్ల పర్యవేక్షణలో తీరిక సమయంలో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి శిక్షణ అందించి భరోసా కల్పించినందుకు డీఈఓకు, విద్యా శాఖ, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– జి.పార్వతి, ఎస్ఓ, కేజీబీవీ, మిర్యాలగూడ