నీలి విప్లవంలో భాగంగా ఏడేండ్ల పాటు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. నల్లగొండ జిల్లాకు సంబంధించి 2016-17 నుంచి 2022-23 వరకు ఏటా 6 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయగా, ఈసారి 3 కోట్లకు మాత్రమే టెండర్లు స్వీకరించింది. ఈ నెల 19న ఈ ప్రక్రియ పూర్తవడంతో త్వరలోనే ఫైనల్ చేసి వచ్చే నెల నుండి చెరువుల్లో సీడ్ పోయనున్నది. చేప పిల్లల సంఖ్య సగానికి తగ్గడంతో ఈసారి చిన్న చెరువులను మినహాయించి పెద్ద చెరువులు, రిజర్వాయర్లలోనే వదిలే అవకాశం ఉంది.
మత్స్యకారులకు అరకొర ప్రయోజనమే..
జిల్లావ్యాప్తంగా 227 మత్స్య సహకార సొసైటీలు ఉండగా ఆయా సొసైటీల్లో 25 254 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 24 మహిళా సొసైటీలు ఉన్నాయి. ఈ సభ్యులు జిల్లాలోని 9 జలాశయాలు, 1,399 చెరువుల్లో చేపలు పట్టి వాటిని స్థానికంగా, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసి ఏటా రూ.400 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహంతో ఏడేండ్లుగా మత్స్యకారులు ఉపాధి మెరుగు పడింది.
కొర్రమీను, బొచ్చ, రవ్వ, పాంప్లెంట్, జల్ల, బురక, చందమామ, ఆలుగ, బురద మట్ట వంటి చేపలను చేపలను పెంచి ఇక్కడి అవసరాలు తీరాక ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, డిల్లీ, కర్నాటక రాష్ర్టాలకు ఎగుమతి చేసేవారు. ఈసారి సగం పిల్లలను వదిలే అవకాశం ఉండడంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి కష్టం కానుంది. మత్స్యకారుల ఉపాధిపైనా తీవ్ర ప్రభావం పడనున్నది.
బీఆర్ఎస్ పాలనలో ఏడేండ్లుగా ఏటా ఆరు కోట్ల చేప పిల్లల విడుదల
2014కు ముందు జిల్లావాసులు చేపలు తినాలంటే పొరుగున ఉన్న ఆంధ్రా లేదా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే చేపలే దొరికేవి. 2016-17 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటా రూ.5.50 కోట్లు వెచ్చించి నల్లగొండ జిల్లాలోని నీటి వనరుల్లో 6 కోట్ల చేప పిల్లలను వదులుతూ వచ్చింది. ఇందుకోసం ఏడేండ్లలో రూ.29.27 కోట్లు ఖర్చు చేసింది. ఏటా రిజర్వాయర్లల్లో రొయ్య పిల్లలను కూడా విడుదల చేసేది. తద్వారా మత్స్యకారులకు కూడా చేతినిండా పని దొరికింది.
నీలి విప్లవం కింద పలు చెరువుల నిర్మాణం..
నీలి విప్లవంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృత్రిమ చెరువుల నిర్మాణాలను కూడా ప్రోత్సహించింది. 2017-18 నుంచి 2020-21 వరకు ప్రభుత్వం 60శాతం సబ్సిడీతో మహిళా మత్స్యకారులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు చెరువుల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. జిల్లాలో 55 మంది మత్స్యకారులు చేపల చెరువులు నిర్మించుకునేందుకు రూ.3.32 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. సీడ్ ఉత్పత్తికి సంబంధించిన చెరువుల నిర్మాణానికి 37 మందికి మరో 1.84 కోట్ల సబ్సిడీ అందజేసింది. చేప సీడ్ హాచరీస్, రీసర్క్యులేటెడ్ ఆక్వా కల్చర్ పద్ధ్దతి, పంజరంలో చేపలు పెంచడాని రూ.10కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చింది. చేపలు అమ్మడానికి, చేపలు పట్టే సామగ్రికి, రవాణా వాహనాలకు 60 నుంచి 90శాతం సబ్సిడీతో ఏడేండ్లల్లో 7 వేల మందికి రూ.42కోట్ల సబ్సిడీని అందించింది.
సూర్యాపేట జిల్లాలో…
సూర్యాపేట జిల్లాలో 167 మత్య్స సహకార సంఘాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని 648 చెరువుల్లో 3.38 కోట్ల ఉచిత చేప పిల్లలను వదిలి వారికి ఉపాధి కల్పించేవారు. తాజా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇక్కడ 1.70 కోట్ల చేప పిల్లలను అందించనున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. సమైక్య పాలనలో సూర్యాపేట జిల్లా పరిధిలో 144 మత్స్య సహకార సంఘాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హతను బట్టి 167 సంఘాలకు పెంచి, కొత్త సభ్యులకు అవకాశం కల్పించింది.
తద్వారా 14 వేల మంది మత్స్యకారుల నుంచి 20 వేల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చింది. 4 వేల మందికిపైగా సబ్సిడీపై వాహనాలను సమకూర్చింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి చేప పిల్లల విడుదలకు గానూ నాలుగు టెండర్లు వచ్చినట్లు సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్ తెలిపారు. మత్య్సకారులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందించే చేప పిల్లలను ఉచితంగా పొందవచ్చన్నారు.
గతేడాది పోసిన చేపపిల్లల్లో ఈసారి 50 శాతమే..
జిల్లాలోని నీటి వనరుల్లో గతేడాది పోసిన చేప పిల్లలసంఖ్యలో 50 శాతం మాత్రమే పోసేందుకు టెండర్లు పిలువాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు టెండర్లు తీసుకున్నాం. చిన్న చెరువుల్లో సీడ్ పోయాలా, వద్దా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఆదేశానుసారం ఏయే చెరువుల్లో పోయమంటే వాటిల్లో వదలడం జరుగుతుంది.
-చరితారెడ్డి, జిల్లా మత్స్య శాఖ అదికారి, నల్లగొండ
కేసీఆర్ హయాంలోనే మంచిగా బతికినం
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే మేము ఆర్థికంగా మంచిగా బతికినం. గతంలో మా చెరువులో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు వదిలిండ్రు. సొసైటీ సభ్యులం ఆ చేపలను పట్టుకొని అమ్మి సమాజంలో మెరుగ్గా జీవించినం. ఈకాంగ్రెస్ సర్కారోళ్లు కేవలం రిజర్వాయర్లలో మాత్రమే చేప పిల్లలను పోస్తామని చెబుతుండ్రు. చెరువుల్లో ఉచిత చేప పిల్లలను పోసే పరిస్థితి లేకుంటే మా బతుకులు కష్టంగా మారనున్నాయి.
-పిల్లి సైదులు, మత్య్సకార్మికుడు, దోమపల్లి, నల్లగొండ మండలం