చౌటుప్పల్, జూన్ 22 : పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వైద్యసేవలు అందిస్తున్న దవాఖానలపై శనివారం వైద్య శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అందులో భాగంగా సాయిరాం, ప్రియాంక ఎముకల దవాఖాన, సంజీవిని ఫిజియోథెరపీ, అర్షమొలలు తదితర ఆస్పత్రులను తనిఖీ చేశారు. క్లినికల్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేకపోవడంతో ఆయా దవాఖానలను సీజ్ చేశారు. అర్హత లేని డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు.
రోగుల బలహీనతలు ఆసరాగా చేసుకొని, పసరు కట్లు, అనవసరమైన చికిత్సలు చేసి డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం. సీజ్ చేసిన దవాఖానలను తక్షణమే ఖాళీ చేయాలని వైద్యశాఖ అధికారులు సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పాపారావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీలో డిఫ్యూటీ డీఎంహెచ్ఓ యశోధ, పీఓఎన్సీడీ సుమన్ కళ్యాణ్, మెడికల్ ఆఫీసర్ కాటంరాజు పాల్గొన్నారు.