కట్టంగూర్, మే 15 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను గురువారం కట్టంగూర్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కన్వీనర్ పాడిచేటి సులోచన, కో కన్వీనర్ గుడుగుంట్ల రామకృష్ణ, పొడిచేటి లింగయ్య, అక్బర్, సలీం, బొల్లెద్దు లక్ష్మినారాయణ, ఎరుకల శ్రీను, పెంజర్ల కృష్ణ, ముస్కు రవీందర్, ఆశ వర్కర్లు చెరుకు జానకి, సంతోష, అంతటి పద్మావతి పాల్గొన్నారు.