నల్లగొండ సిటీ, మే 20 : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టు బానిసలుగా తయారు చేయాలని చూస్తుందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టిపర్పస్ విధానాన్ని రద్దుచేసి జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు రాసి లింగయ్య, మురకల నరసింహ, కాలింగ్ భిక్షం, కట్ట స్వర్ణ, జీవనజ్యోతి, సైదమ్మ పాల్గొన్నారు.