నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : కొంతకాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం పెడుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురైట్టెంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో పెద్దఎత్తున నకిలీ మద్యం, తయారీకి ఉపయోగించే స్పిరిట్, ఫ్లేవర్స్, ఇతర సామగ్రి పట్టుబడింది. ఇప్పటికే తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం మొదలైన ఆపరేషన్ బుధవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. దాంతో దీనిపై అధికారికంగా స్పందించేందుకు నల్లగొండ ఎస్పీ సహా ఎవరూ ముందుకు రాలేదు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో వివరాలు వెల్లడించలేమని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
చండూరుకు చెందిన పండ్ల వ్యాపారి ఎర్రజెల్ల రమేశ్ కొన్నేండ్లు పండ్లు, ఇతర పదార్ధాలతో వైన్ తయారు చేసినట్లు సమాచారం. ఇందుకోసం నాంపల్లి మండలం గానుగుపల్లిలో తాను కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఇతడికి చండూరుకు చెందిన ఓ మటన్ వ్యాపారి, వైన్స్‌లో పని చేసే ఓ వ్యక్తి తోడై నకిలీ మద్యం కూడా తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. సదరు మటన్ వ్యాపారి గతంలో హైదరాబాద్ వైన్స్‌లో పని చేసిన సమయంలో నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడిగా తెలుస్తున్నది. ఇతడి సూచన మేరకు రమేశ్ గానుగుపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోట ఉండగా దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి, గేటు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
ఇందులోనే పండ్ల చెట్ల మధ్యలో పెద్ద గొయ్యి తీసి అందులో ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంచాడు. వాటిల్లో కొద్దిరోజులు కొంత చీప్‌లిక్కర్‌ను, దానికి స్పిరిట్‌ను, టేస్ట్ కోసం కావాల్సిన ప్లేవర్స్‌ను మిక్స్ చేసి నిల్వ చేస్తున్నట్లు తేలింది. తరువాత డ్రమ్ముల్లో నుంచి 20 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లోకి దీన్ని డంప్ చేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఖరీదైన మద్యం లేబుళ్లు కలిగిన ఖాళీ బాటిళ్లలోకి నింపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీన్ని నేరుగా వైన్స్‌షాపులకు కాకుండా సిట్టింగ్‌లు, బెల్ట్‌షాప్‌లు, ఫంక్షన్లల్లో మద్యం పార్టీలకు సేల్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో స్థానిక నేతలు తమ అనుచరులకు రెగ్యులర్‌గా మద్యం తాపేందుకు వీలుగా లూజ్ సేల్స్గానూ విక్రయిస్తున్నట్లు తెలిసింది. లూజ్సేల్స్గా విక్రయించిన మద్యం అక్కడక్కడ చెలామణిలోకి రావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించడంతో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టురైట్టెంది. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం కనగల్ మండలం ఎడవెల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇక్కడ నాలుగు క్యాన్లల్లో 80 లీటర్ల మద్యం దొరికినట్లు తెలిసింది.
అతడు ఇచ్చిన సమాచారంతో చండూరులో రమేశ్ ఇంటిపై దాడులు చేయగా అక్కడ 60లీటర్ల లూజ్ మద్యం మూడు క్యాన్లల్లో బయటపడింది. రమేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. రమేశ్ తాను నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న గానుగుపల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసులకు చూపించక తప్పలేదు.
ఇక్కడ భారీ గోతి తీసి అందులో నాలుగు డ్రమ్ముల్లో నిల్వ ఉన్న స్పిరిట్తోపాటు 8 క్యాన్లల్లో నిల్వ చేసిన నకిలీ మద్యం, మద్యంలో టేస్ట్ కోసం ఉపయోగించే ప్లేవర్స్తోపాటు ఖాళీ క్యాన్లు, మద్యం బాటిల్స్‌ను కూడా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి అటువైపు మీడియాతోపాటు ఇతరులెవరినీ రానివ్వలేదు. తర్వాత చండూరు మండలం గుండ్రపల్లి శివారులోని వ్యవసాయ భూమిలోనూ ఇదే తరహా నకిలీ మద్యం తయారీ వ్యవస్థ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
మద్యం, కల్లు విక్రయాలకు పేరున్న హైదరాబాద్ ధూల్పేటలోనూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. చండూరుకు చెందిన రమేశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ధూల్‌పేటకు ప్రత్యేక బృందం వెళ్లినట్లు తెలిసింది. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్తోపాటు ఫ్లేవర్స్, క్యాన్లు, ఖాళీ బాటిళ్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
దాంతో నకిలీ మద్యం తయారీ రాకెట్‌తో సంబంధాలు ఉన్న ధూల్‌పేటకు చెందిన పలువురిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిందనీ బుధవారం రాత్రి వరకు రహస్యంగా విచారిస్తూనే ఉన్నారు. దీనిపై మీడియాతో కథనాలు వెలువడ్డా అధికారికంగా స్పందించేందుకు పోలీసుల నిరాకరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే వివరాల వెల్లడించడమేని చెప్తున్నారు. ఈ మొత్తం కేసును ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా ఇవ్వాలో, రేపో నకిలీ మద్యం రాకెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.