– రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
– చోరీ కేసు చేధించిన సూర్యాపేట జిల్లా సిసిఎస్, ఆత్మకూరు పోలీసులు
– వివరాలు వెల్లడించిన ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట టౌన్, మార్చి 14 : వరుస దొంగతనాలుకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, ఆటోలు, బైక్ లు ల్యాప్‌టాప్‌లు దొంగిలించే ముఠాను సీసీఎస్, ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్టు చేసి రూ.13.35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కె.నరసింహ కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేశ్, షేక్ నశ్రీన్, కంచుకొమ్ముల సాయికిరణ్ ఒక ముఠాగా ఏర్పడి ఆటోలను దొంగలించి, వాటిలోనే ప్రయాణం చేస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి ఆభరణాలు దొంగలించే వారు. దొంగలించిన ఆటోలోనే తిరుగుతూ రాత్రివేళ తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనం చేయడం వీరి పద్ధతి. సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు చెందిన వీరు ముఠాగా ఏర్పడి ఈ నెల 6న ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని కోటినాయక్ తండా శివారులో ఒక వృద్ధురాలిని ఆటోలో ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్లి చంపుతామని బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసులను అపహరించుకుపోయారు.
బాధితులు ఈ నెల 10న ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చోరీ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా సిసిఎస్ పోలీసులు ఆత్మకూరు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరస్తులను గుర్తించి వారి కదలికలను గమనించారు. శనివారం ఉదయం ఆత్మకూరు మండల పరిధిలోని ఎనుబాముల స్టేజీ వద్ద సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నలుగురు అనుమానితులు టీఎస్ 29 టీ 1190 ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకోన్నారు. కోదాడ రాజీవ్ నగర్‌కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేశ్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నశ్రీన్ లుగా గుర్తించారు. వీరు గతంలో మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, తిప్పర్తి, పిడుగురాళ్ల, మేళ్లచెరువు, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో బంగారు, వెండి అభరణములు, వెండి వస్తువులు, ఆటోలు, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ దొంగతనాలు చేసినట్లు అంగీక రించారు.
నిందితుల నుండి రూ.3 లక్షల విలువైన 18 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువైన 1.5 కేజీల వెండి, రూ.4 లక్షల విలువైన 3 ఆటోలు, రూ.50 వేల విలువైన ట్యాబ్, ల్యాప్ టాప్, 1 బైక్, 1 టీవి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులందరు దగ్గరి బంధువులు ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. వీరందరూ పాత నేరస్తులు పలు స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. కేసు చేదనలో బాగా పని చేసిన సిసిఎస్ సిబ్బంది, ఆత్మకూరు ఎస్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్, హరికృష్ణ, ఆర్ఎస్ఐ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు అరెస్ట్