చండూరు, జనవరి 5 : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ఇప్పటికే చౌటుప్పల్‌లో డయాలసిస్ కేంద్రం, మర్రిగూడలో 30 పడకల దవాఖానను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా.. చౌటుప్పల్ నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన మంత్రి కేటీఆర్.. గత నెలలో మునుగోడులో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులపై చర్చించారు. చండూరులో పది కోట్ల పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ శుక్రవారం రూ.3కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.5కోట్లతో డ్రైనేజీ, రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.50లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.2కోట్లతో చేపట్టనున్న మున్సిపల్ భవన పనులను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన వంద పడకల ఆసుపత్రి కోసం స్థలాన్ని పరిశీలించనున్నారు.
మరో రూ.30 కోట్లకు ప్రతిపాదనలు
మునుగోడులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ చండూరు పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు ప్రకటించారు. ఈ మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రూ.22 కోట్లతో చండూరులో రోడ్ల విస్తరణతోపాటు సెంట్రల్ లైటింగ్, రూ.8కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, అంతర్గత డ్రైనేజీ, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మిషన్ భగీరథ పెండింగ్ సైతం పూర్తి చేస్తున్నారు.
గట్టుప్పల్‌లో చేనేత క్లస్టర్
చేనేత కార్మికుల సంక్షేమం కోసం గట్టుప్పల్ మండల కేంద్రంలో కోటీ 62 లక్షలతో, తేరట్‌పల్లిలో కోటీ రెండు లక్షలతో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం గట్టుప్పల్ గ్రామానికి మంత్రి వెళ్లనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో చండూరుకు రానున్నారు. అంగడిపేట నుంచి రోడ్డు మార్గంలో గట్టుప్పల్రే చేరుకొని చేనేత క్లస్టర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం చండూరులో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. కాగా, వద్ద హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్కిృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీఓ జయచంద్రరెడ్డి గురువారం పరిశీలించారు.
సరంపేట తండా రోడ్డుకు రూ.7కోట్లు ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం
మర్రిగూడ, జనవరి 5 : మండలంలోని సరంపేట తండా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.7కోట్లు మంజూరు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. సరంపేట గ్రామం నుంచి సరంపేట తండా మీదుగా దామెర భీమనపల్లికి తండావాసుల విజ్ఞప్తి మేరకు బీటీ రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఆయన కృషితో రోడ్డు నిర్మాణానికి ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.7కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రోడ్డు పనులను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎస్సీ కాలనీలో జనావాసాలకు దగ్గరగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ అధికారులతో మాట్లాడి వేరే చోటుకు మార్చేలా కృషి చేశారు. ఇండ్ల మీది నుంచి ఉన్న 33కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించేందుకు రూ.2.64లక్షలు మంజూరు చేయించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్లిప్‌కార్ట్ ఆన్లైన్ సంస్థ ద్వారా మహిళలకు శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా కృషి చేశారు. ఇచ్చిన హామీ మేరకు పనులు చేపడుతుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.