చార్మినార్, ఫిబ్రవరి 3: మజ్లిస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ పాషాఖాద్రీ (72) మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖాద్రీ కొంతకాలంగా నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల దవాఖాన నుంచి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఆరోగ్యం విషమించడం తో ఇంట్లోనే మృతి చెందారు. పాషా ఖాద్రీ చార్మినార్, యాకుత్‌పురా నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. నూర్ఖాన్ బజార్‌లోని మస్జిద్ ఎ హజ్రత్ సయ్యద్ మొహియుద్దీన్ పాషా శ్మశానంలో బుధవారం మధ్యాహ్నం 1:20 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఖాద్రీ మరణంపై ఎంఐఎం నేతలు, ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులు సంతాపం తెలిపారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది: కేటీఆర్
పాషా ఖాద్రీ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతా పం ప్రకటించారు. నిత్యం చిరునవ్వుతో కనిపించే ఖాద్రీ కన్నుమూయడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచే కూరాలని ప్రార్థించారు. బంధుమిత్రులు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఖాద్రీ మరణం బాధాకరం: హరీశ్‌రావు
ఖాద్రీ మృతిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించిన ఆయన కన్నుమూయడం బాధాకరమని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.