నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 3: బీఆర్ఎస్లోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో భీమ్‌గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చెవ్వ కృష్ణ, జీషాన్ బీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో భీమ్‌గల్ 7వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి మహ్మద్ ఆసిఫ్ పోటీ నుంచి తప్పుకొని వేముల సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు నారడి నాగరాజు, రియాజ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్‌తోపాటు ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్యూన్‌బస్తీకి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ తలుగు అనిల్ 100 మంది కార్యకర్తలతో కలిసి గులాబీ గూటికి చేరారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొజ్జ రాజయ్య ఆధ్యర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.