Munugode | ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మునుగోడు.. ఒక్కొక్కటిగా అమలులోకి ఉపఎన్నిక హామీలు
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు వేదికగా మరోసారి స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. పైగా చివర్లో తన ఆర్థిక, రాజకీయ అవసరాలతోపాటు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాజీనామా అస్ర్తాన్ని తెరమీదకు తెచ్చారు.
- ఒక్కొక్కటిగా ఉపఎన్నికల హామీల అమలు
- తాజాగా చండూరు రెవెన్యూ డివిజన్‌కు నోటిఫికేషన్
- చౌటుప్పల్‌లో ముమ్మరంగా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం
- రూ.74.16 కోట్లతో బీటీ రోడ్లకు టెండర్లు
- రూ.3.86కోట్లతో 3 చేనేత క్లస్టర్ల ఏర్పాటు
- గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవన్‌కు గ్రీన్‌సిగ్నల్
- కోట్ల రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
Munugode |మునుగోడు నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఒక్కొక్కటిగా ఆచరణ రూపం దాలుస్తున్నాయి. ఏడాదిలోనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామంటూ మునుగోడు అభివృద్ధి సమీక్షలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన మేరకు ఇప్పటికే అన్నీ కార్యరూపంలోకి వచ్చాయి. తాజాగా కీలకమైన చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలకు అవకాశం కల్పిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా వెలువడింది. చౌటుప్పల్‌లో వంద పడకల దవాఖాన, సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్, తెరటుపల్లిలో చేనేత క్లస్టర్లు, సంస్థాన్ నారాయణపురంలో బంజారాభవన్, ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, బీటీ రోడ్ల నిర్మాణాలు వందల కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. దాంతో అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, బీఆర్ఎస్తోనే మునుగోడు గోడు తీరుతుందన్న సంతోషం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు వేదికగా మరోసారి స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. పైగా చివర్లో తన ఆర్థిక, రాజకీయ అవసరాలతోపాటు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాజీనామా అస్ర్తాన్ని తెరమీదకు తెచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతూ బీజేపీ నుంచి బరిలోకి దిగాడు. కానీ, ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే చేసిందేమీ లేక ఉప ఎన్నికకు కారణమయ్యాడంటూ ప్రజలు తిరగబడ్డారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల మాదిరిగా మునుగోడు అభివృద్ధిని కోరుకున్న ఇక్కడి ప్రజలు ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ చండూరు వేదికగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం గత నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు వెలువడితే డిసెంబర్ 1న మంత్రి కేటీఆర్ స్వయంగా మునుగోడు వచ్చి సమీక్ష చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మునుగోడు అబివృద్ధిపై రోడ్‌మ్యాప్‌ను వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ ప్రకటించిన విధంగా అన్ని పనులు కార్యరూపం దాల్చాయి.
రూ.3.68 కోట్లతో చేనేత క్లసర్లు
చేనేత పరిశ్రమకు మునుగోడు నిలయం కాగా, అందుకు అనుగుణంగా హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నారాయణపురం, గట్టుప్పల్, తేరటుపల్లిలో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే నిధులు మంజూరు చేశారు. గట్టుప్పల్‌లో రూ.2.37 కోట్లతో, తేరటుపల్లిలో రూ.76 లక్షలతో, నారాయణపురంలో రూ.73 లక్షలతో క్లస్టర్లకు తొలి విడుతగా 60 శాతం నిధులు విడుదల చేశారు. దాంతో మగ్గాల కొనుగోళ్లు, ఆసు యంత్రాలకు ఆర్డర్లు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే..
మునుగోడు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విరివిగా నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే చండూర్ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుతోపాటు చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది. అంతర్గత, బీటీ రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరేలా మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిపించినందుకు మునుగోడును అగ్రగామిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. జరుగుతున్న అభివృద్ధితో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మునుగోడు
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ
అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, బీటీ రోడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధతో వందల కోట్లు వెచ్చిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.89కోట్లతో 50కి పైగా మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నారు. కొన్ని పనులు ప్రారంభం కాగా మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మరో రూ.25 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఉపాధి హామీ నిధులు రూ.35 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. మరో రూ.50 కోట్లతో ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం జరుగుతున్నది.
శరవేగంగా 100 పడకల ఆస్పత్రి
ఉప ఎన్నికల హామీ మేరకు చౌటుప్పల్ కేంద్రంగా 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. రూ.38 కోట్లతో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేయగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే 20 మందికిపైగా వైద్యులు, 100 మందికి పైగా వైద్య సిబ్బందితో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ ఏడాది జనవరి 3న చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఐదు యూనిట్లతో విజయవంతంగా సేవలు కొనసాగుతున్నాయి. మర్రిగూడలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని కూడా అదే రోజున ప్రారంభించారు. పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించడంతో మారుమూల ప్రాంతమైన మర్రిగూడలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి.
కీలకమైన అభివృద్ధి పనుల్లో కొన్ని..
- తిరుగండ్లపల్లి, లచ్చమ్మగూడెం, పెద్దకొండూరులో 33/11 కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, మరో రెండింటికి త్వరలో భూమిపూజ.
- చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో ముమ్మరంగా రోడ్ల విస్తరణ పనులు.
- చండూర్లో రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్, మరో రూ.2 కోట్లతో ఆధునిక ధోబీఘాట్ నిర్మాణ పనులు.
- చౌటుప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు. కొనసాగుతున్న పనులు.
- చౌటుప్పల్ మండలంలో రూ.25 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో కొనసాగుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు.
- దండుమల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 100 ఎకరాల్లో టాయ్స్ పార్క్‌కు సన్నాహకాలు, స్థలం కేటాయింపు.
రెవెన్యూ డివిజన్‌గా చండూరు
ఉప ఎన్నికలో కీలకమైన డిమాండ్‌గా ఉన్న చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలైంది. చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలతో డివిజన్ ఏర్పాటు కానున్నది. అభ్యంతరాలు, సలహాల స్వీకరణ అనంతరం తుది గెజిట్ వెలువడనున్నది. త్వరలోనే చండూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దాంతో ఈ ప్రాంత ప్రజలు సంబురాలు చేశారు. ఇప్పటికే ఉప ఎన్నికల సమయంలోనే గట్టుప్పల్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేశారు.
సంస్థాన్‌నారాయణపురానికి గిరిజన గురుకులం..
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంస్థాన్‌నారాయణపురంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాలను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతి గదులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రంలో తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించి పనులు పూర్తిచేయిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 5, 6వ తరగతులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
నాలుగేండ్ల నిరీక్షణకు తెర
ఫ్లోరైడ్ బాధితులకు, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మండల కేంద్రంలో 30 పడకల దవఖానా నిర్మించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్పత్రి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నిక హామీలో భాగంగా మంత్రి హరీశ్‌రావు దవాఖానను ప్రారంభించి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్వయంగా వచ్చి దవాఖానను ప్రారంభించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసి ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే దవాఖాన ప్రారంభమైంది.
-మహ్మద్ అబ్దుల్ రజాక్, తమ్మడపల్లి, మర్రిగూడ
గిరిజనులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
సీఎం కేసీఆర్ తండాల ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఉప ఎన్నికలో గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవనం, సంత్ సేవాలాల్ గుడి నిర్మాణం, బీటీ రోడ్లు, ప్రతి విధిలో సీసీ రోడ్లు, లింకు రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మా తండాల ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మండల కేంద్రంలో గిరిజన గురుకులం ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సార్లకు గిరిజనుల తరఫున ధన్యవాదాలు.
బతికుండగా మా ఊరికి రోడ్డు చూస్తా అనుకోలే..
నేను బతికుండగా మా ఊరికి రోడ్డు వేస్తారని అనుకోలేదు. తండా నుంచి బయటికి వెళ్లాలంటే పానం మీదకు వచ్చేది. ఆ రోడ్డు మీద పోలేకనే ఎకడికి పోకుండా ఇంటి దగ్గరే ఉండేదాన్ని. రోడ్డు వేసి ప్రభుత్వం పుణ్యం కట్టుకుంది. నా పైండ్లెన నాటి నుంచి వచ్చిన అందరినీ అడుగుతున్నాం మా తండాకు డాంబర్ రోడ్డు వేయాలని. వేస్తం అనేటోళ్లే తప్ప, తండా దాటగానే మరిచిపోయేటోళ్లు. కానీ, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సారు రోడు వేయిస్తా అని మాట ఇచ్చిండు. మాట మీద నిలబడి రోడ్డు వేయించిండు. ఆయనకు మా తండావాళ్లమంతా రుణపడి ఉంటాం.
-సఫావత్ టుక, జాన్‌తండా, నాంపల్లి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

