నకిరేకల్, జూలై 4: ‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని సవాల్ విసిరిన పవన్ కల్యాణ్‌కు సీఎం తిరిగి సవాల్ విసరకుండా, అదే కుటుంబంలోని ఒకరికి ట్రస్టు బోర్డు సభ్యత్వం ఇచ్చారని, పదే పదే తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుతున్నామని ప్రగల్భాలు పలకడం తప్ప సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదని అన్నారు. పదవులు, కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకే కట్టబెట్టి, తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడటం వారికే చెల్లుతుందన్నారు. నకిరేకల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు, నాయకులకు గౌరవం ఇచ్చారని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు వాడెవడు, వీడెవడూ అంటూ బజారు భాషలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బహిరంగ చర్చలకు రాలేక పారిపోయిన మంత్రులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేశ్, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు దైద పరమేశం, రామకృష్ణ పాల్గొన్నారు.