రామన్నపేట, నవంబర్22: బీఆర్ఎస్ రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. మండలంలోని ఇంద్రపాలనగరంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతు మందడి సాగర్‌రెడ్డి ఇటీవల ధాన్యం లారీలోడ్ తెచ్చారు. ఈ నెల 14న ధాన్యానికి వ్యవసాయ శాఖ అధికారులు మ్యాచర్ పరిశీలించారు. మ్యాచర్ రావడంతో ఈ నెల 17న ధాన్యం కాంటా చేయడానికి గన్నీ బ్యాగులు పంపించారు. ఈ నెల 20న ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి రైస్‌మిల్లుకు తరలించి ట్రక్‌షీట్ ఇచ్చారు.
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో బీఆర్ఎస్ రైతుల ధాన్యాన్ని తీసుకోవద్దని రైస్‌మిల్ యజమానిని ఫోన్ చేసి బెదిరించారు. దీంతో మందడి సాగర్‌రెడ్డి ధాన్యాన్ని శుక్రవారం రాత్రి తిరిగి పంపించారు. ఆయన ధాన్యాన్ని కళ్లంలో ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం అక్కడకు చేరుకుని రైతులతో మాట్టాడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు, దోపిడీ కొనసాగుతోందన్నారు. రైతుల గోడును చెప్పేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
అనంతరం డీఎస్‌వోతో ఫోన్లో మాట్లాడి రెండు గంటల్లో ధాన్యం లారీలోడ్ ఖాళీ చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుదని.. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం కాలిగాయంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న మందడి శ్రీధర్‌రెడ్డిని పరామర్శించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు, గొరిగే నర్సింహ, బద్దుల ఉమా రమేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గర్దాసు విక్రం, ఎస్కే చాంద్, మంటి లింగస్వామి, రాస వెంకటేశం, గర్దాసు కర్ణాకర్, పగడాల వెంకటేశం, మంటి భిక్షమయ్య, సింగనబోయిన సత్యనారాయ ణ, దశరథ, మల్లేశం పాల్గొన్నారు.