కొండమల్లేపల్లి/ పీఏపల్లి/ పెద్దవూర, ఏప్రిల్ 22 : అధికారం కోసమే కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి సోమవారం కొండమల్లేపల్లి, పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే పాత రోజులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏ పల్లెకు పోయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామన్నా భావన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతుందని, ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నదని అన్నారు. ఆ తర్వాత జనవరి 26 అంటారని ఎద్దేవా చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 209 మంది రైతులు అత్యహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటోవాలాల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కుటుంబం గడువక 49 మంది ఆటో డ్రైవర్లు అత్మహత్య చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం లేదని విమర్శించారు. రైతులు బాగుపడడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇష్ట్రం లేదని, అందుకే ప్రాజెక్టుల నుంచి నీరు వదలడం లేదని అన్నారు. 420 మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఝాటా పార్టీ అని విమర్శించారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి మల్లికార్జున్‌రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, దేవరకొండ పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, నాయకులు నేనావత్ కిషన్‌నాయక్, రమావత్ రమేశ్‌నాయక్, కేసాని లింగారెడ్డి, రమావత్ దస్రూనాయక్, టీవీఎన్‌రెడ్డి, తులసీరాం నాయక్, రవి నాయక్ పాల్గొన్నారు.
పక్కన కృష్ణమ్మ ఉన్నా పొట్ట దశకు వచ్చిన పొలాలను ఎండబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఇక ముందు కూడా చేయబోయేది ఏమీ లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో పార్లమెంట్‌కు పంపితే మన జిల్లా సమస్యలు తీరుతాయి. ప్రజలంతా గమనించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి.
– ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వాటిని తుంగలో తొక్కి రైతులను, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచింది. గతంలో కుటుంబ పాలన వద్దన్న జానారెడ్డి తన స్వార్థంతో ఒక కొడుకును ఎమ్మెల్యే చేసి, మరో కొడుకుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆయనకు, ఆయన కుమారుడికి, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
– మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
‘నన్ను ఆదరించి గెలిపిస్తే జిల్లా, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతా. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అభివృద్ధిలో నల్లగొండను ముందు వరుసలో నిలబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతుంది. పంటలు ఎండిపోతున్నా, ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పాలకులు నోరు మెదపడంలేదు. కేసీఆర్, బీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్న కాంగ్రె.. తమ చేతగానితనాన్ని ఇతర పార్టీలపై రుద్దుతున్నది. నన్ను పార్లమెంట్‌కు పంపిస్తే నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తా.’
– కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి
మోసకారి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు, రైతులు మళ్లీ నమ్మొద్దు. కేసీఆర్ పాలనలో మండు వేసవిలోనూ చెరువులు మత్తడి పోశాయి. కాంగ్రెస్ పాలనలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏ సంవత్సరం ఆగస్టులో చేస్తారో స్పష్టంగా ప్రకటించాలి. గతేడాది వానకాలంలో వరికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది ఇస్తామంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికీ అందించలేదు.
– రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు