చందంపేట(దేవరకొండ)జూన్ 10 : వానకాలం ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదును జమ చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవరకొండలో ఆయన సోమవారం మాట్లాడారు.
వానకాలం వచ్చినా రైతు బంధు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఎకరాకు రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు సకాలంలో జమ అయ్యిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.