నూతనకల్, జూలై 6 : అమలు కాని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్బంధాలు, అరెస్టులతో అరాచక పాలన చేస్తున్నారన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగినా.. 24గంటల కరెంట్ అందించలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందని విమర్శించారు. ప్రస్తుత కరువు నేపథ్యంలో కాళేశ్వరం నీళ్లు అందించే అవకాశం ఉన్నా.. ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాపర్ డ్యామ్ కట్టి కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వచ్చని ఇంజినీర్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పంటకు బోనస్, రూ.15వేల రైతు భరోసా అని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్ర పాలన మరిచి ఢిల్లీకి పోయి వచ్చుడు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్పప్పుడు మంజూరు చేయించిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మళ్లీ గొడవలు జరిగేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తస్మాత్ జాగ్రత్త.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, మాజీ జడ్పీటీసీలు గుగులోతు నర్సింగ్‌నాయక్, జీడి భిక్షం, నాయకులు చూడి లింగారెడ్డి, బత్తుల సాయిల్‌గౌడ్, విద్యాసాగర్, లింగరాజు, సురేందర్‌నాయక్, బుచ్చయ్యగౌడ్, వెంకన్న, విజయ్‌కుమార్, మహే శ్, రాజేశ్, వీరూయాదవ్, యాదగిరి ఉన్నారు.