శాలిగౌరారం, మార్చి 2 : రైతు సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, తెలంగాణ రాష్ర్టానికి ఇది వర ప్రదాయిని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చిల్లర రాజకీయం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తుంగతుర్తి నియోజవర్గానికి 95వేల ఎకరాలకు మించి సాగు నీరు అందించామని, ఏడాదికి 10నెలలు కాల్వల్లో నీరు పారించి పంటలను కాపాడామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన చిన్న పొరపాటును సాకుగా చూపించి కేసీఆర్ సర్కారును బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని సరి చేసే బాధ్యత ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రభుత్వానికి ఉందని, తక్షణమే ఆ పని చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు బంద్ చేసి, రాష్ట్ర ప్రజలకు మంచి పాలనా అందించాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, నాయకులు కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు, కల్లూరి సతీశ్‌గౌడ్, జెర్రిపోతుల చంద్రమౌళి, చిరబోయిన శ్రీనివాస్, రాజు, వెంకన్న, కల్లెట్లపెల్లి వీరయ్య, చింతల శంకర్, నోముల శ్రీనివాస్ పాల్గొన్నారు.